కంది రైతులకు అదిరిపోయే సాగు చిట్కాలు.. ఈ మెళకువలు పాటిస్తే పంట దిగుబడి డబుల్!

Toor Dal Organic Farming Tips: కంది సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు అద్భుతమైన చిట్కాలు. రైజ్డ్ బెడ్స్, తెగుళ్ల నివారణ మరియు ఆర్గానిక్ కందిపప్పుతో అధిక లాభాలు పొందే మార్గాలు.

Arun Chilukuri
Published on: 31 Oct 2026 1:23 PM IST
కంది రైతులకు అదిరిపోయే సాగు చిట్కాలు.. ఈ మెళకువలు పాటిస్తే పంట దిగుబడి డబుల్!
X

కంది రైతులకు అదిరిపోయే సాగు చిట్కాలు.. ఈ మెళకువలు పాటిస్తే పంట దిగుబడి డబుల్!

Toor Dal Organic Farming Tips: తెలుగు రాష్ట్రాల్లో కంది సాగు చేస్తున్న రైతన్నలకు వ్యవసాయ నిపుణులు మరియు అనుభవజ్ఞులైన రైతులు పలు కీలకమైన, ఆధునిక సాగు మెళకువలను సూచిస్తున్నారు. సాధారణంగా ఏకపంటగా కాకుండా సరైన పద్ధతులు పాటిస్తే కంది సాగులో అద్భుతమైన దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా భూమిని సిద్ధం చేసుకునే మొదలుకొని, విత్తన ఎంపిక, అంతర పంటల సాగు మరియు మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ కొన్ని మెళకువలు పాటించడం ద్వారా రైతులు వ్యాపారుల మాదిరిగా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

కంది సాగుకు మే 15 లోపు, అనగా తొలకరి వర్షాలకు ముందు (రోహిణి కార్తెలో) పొలాన్ని రోటోవేటర్ ద్వారా దున్నుకొని సిద్ధం చేసుకోవడం ద్వారా భూసారం పెరుగుతుంది. పశువుల పేడ, ఘనజీవామృతం లేదా పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించి భూమిని గుల్లగా ఉంచుకోవాలి. కంది పంట నీటి ముంపును అస్సలు తట్టుకోలేనందున, పల్లపు నేలల్లో లేదా వర్షాధార భూముల్లో తప్పనిసరిగా 'రైజ్డ్ బెడ్స్' (Raised Beds) విధానంలో సాగు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల భూమి కోత నివారించబడి, మొక్కల వేర్లకు గాలి బాగా అంది బలంగా పెరుగుతాయి.

ఇక విత్తన ఎంపికలో భాగంగా ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకునే నాణ్యమైన రకాలైన ఐసీపీఎల్ 87119, తాండూరుకు చెందిన టీడీఆర్జీ 59 (TDRG 59), బీఎస్‌ఏఆర్ 736 వంటి రకాలను ఎంచుకోవడం మంచిది. నాలుగు అడుగుల వెడల్పుతో రైజ్డ్ బెడ్స్ వేసుకొని 'జంటసాలు' పద్ధతిలో కందిని సాగు చేయాలి. రెండు జంటసాల మధ్య 8 అడుగుల ఖాళీ స్థలంలో పెసర, మినుము, అలసంద లేదా రాగులు, కొర్రలు వంటి అంతర పంటలు వేసుకోవడం ద్వారా స్వల్పకాలంలోనే అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. విత్తే ముందు బీజామృతంతో పాటు ట్రైకోడెర్మా విరిడి, రైజోబియం కల్చర్‌తో విత్తన శుద్ధి చేయడం ద్వారా యూరియా వాడకాన్ని తగ్గించుకోవచ్చు.

సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఆకు చుట్టు పురుగు, కాయ తొలుచు పురుగు నివారణకు వేప నూనె, వేప కషాయం, దశపర్ణి కషాయాలను వారం లేదా పది రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పూత దశలో మంచు ప్రభావం వల్ల పూత రాలకుండా పంచగవ్య లేదా ఫిష్ అమైనో యాసిడ్స్ వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం కందులను నేరుగా అమ్మడంకంటే, సేంద్రీయ పద్ధతిలో పండించిన కందిని 'ఆర్గానిక్ కందిపప్పు'గా ప్రాసెస్ చేసి అమ్ముకోవడం ద్వారా మార్కెట్ ధరకంటే 25 నుండి 30 శాతం అధిక లాభాలు పొందవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు. పంటను నిల్వ ఉంచేటప్పుడు పురుగులు పట్టకుండా త్రీ-లేయర్ బ్యాగ్స్ (Hermetic bags) ఉపయోగించి ఎక్కువ కాలం నాణ్యంగా భద్రపరుచుకోవచ్చని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.