Khet Bachao Abhiyan: 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం... కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమం

Khet Bachao Abhiyan: రబీ 2026 'ఖేత్ బచావో అభియాన్' ద్వారా 50 లక్షల మంది రైతులను చేరుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రచారం చేపట్టింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 7:56 AM IST
Khet Bachao Abhiyan
X

Khet Bachao Abhiyan: 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం... కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమం

Khet Bachao Abhiyan: దేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా మార్చడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడటం, ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ఖేత్ బచావో అభియాన్ (KBA) – రబీ 2026' పేరుతో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 700 జిల్లాలు, 50 వేల గ్రామాల్లో సుమారు 50 లక్షల మంది రైతులకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్‌షీట్ వెల్లడించింది.

నేల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

వ్యవసాయంలో పోషకాల అసమతుల్య వినియోగం, నేలలో సేంద్రియ పదార్థాలు తగ్గిపోవడం, సాగు ఖర్చులు పెరగడం, సహజ వనరులు క్షీణించడం వంటి సమస్యలు రైతులను ప్రభావితం చేస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు ఈ ప్రచారాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, వనరుల సమర్థ వినియోగం, నేల సారాన్ని కాపాడే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

4,150 బృందాలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు

ఈ ప్రచారంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK), వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ATMA) భాగస్వామ్యంతో మొత్తం 4,150 బృందాలు పాల్గొననున్నాయి. వీటికి 12 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు, ATMA కార్యకర్తలు సహకారం అందించనున్నారు.

దేశవ్యాప్తంగా 50 వేల క్షేత్రస్థాయి ప్రదర్శనలు, 11,750 క్రమబద్ధమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్కో ప్రదర్శనలో 20 మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ విధానం ద్వారా సుమారు 10 లక్షల మంది రైతులకు నేరుగా అవగాహన కల్పించనున్నారు.

డిజిటల్ ప్రచారం ద్వారా 2.5 కోట్ల మందికి చేరువ

రైతులకు వ్యవసాయ సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు సోషల్ మీడియా, ఇతర డిజిటల్ మాధ్యమాలను కూడా వినియోగించనున్నారు. సోషల్ మీడియా ద్వారా 1.5 కోట్ల మంది రైతులకు, మొత్తం డిజిటల్ ప్రచారం ద్వారా 2.5 కోట్ల మందికి చేరువ కావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

అలాగే ఎరువుల వినియోగం అధికంగా ఉన్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ జిల్లాల్లో సమతుల్య పోషక నిర్వహణపై మరింత అవగాహన కల్పించనున్నారు.

గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ఈ ప్రచారంలో భాగంగా 950 ఐసీఏఆర్ (ICAR) సంస్థల బృందాలు వారానికి మూడు గ్రామాలను సందర్శించనున్నాయి. మరోవైపు 700 కేవీకే (KVK) బృందాలు వారానికి నాలుగు గ్రామ సందర్శనలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. ప్రతి సందర్శనలో సుమారు 100 మంది రైతులకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఐదు వారాల వ్యవధిలో మొత్తం 5,650 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, సుమారు 28.25 లక్షల మంది రైతులకు చేరువ కావాలని భావిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి నేల ఆరోగ్యం కీలకం

భారతదేశ శ్రామిక శక్తిలో 46 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో నేల ఆరోగ్యం దేశ ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకత, ఆర్థిక స్థిరత్వంపై కీలక ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన నేలలు మెరుగైన పంట దిగుబడులకు దోహదపడటంతో పాటు ఎరువులు, ఇతర బాహ్య వనరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఈ లక్ష్యాలతో చేపట్టిన ఖేత్ బచావో అభియాన్ ద్వారా రైతుల్లో ఆధునిక, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచాలని కేంద్రం భావిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్