Lemon grass: పెట్టుబడి తక్కువ..లాభాలు ఎక్కువ..ఏడాదికి 4 లక్షల ఆదాయం..!

Lemon grass: తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయాన్నిచ్చే నిమ్మగడ్డి సాగు పూర్తి వివరాలు.

Naresh.k
Published on: 5 Jun 2026 2:02 PM IST
Lemon grass
X

Lemon grass: పెట్టుబడి తక్కువ..లాభాలు ఎక్కువ..ఏడాదికి 4 లక్షల ఆదాయం..!

Lemon Grass Farming : గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం ఇచ్చే మార్గం ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. అయితే, ఇప్పటికీ చాలా మంది రైతులు కేవలం సంప్రదాయ పంటల వెనుకే పడుతూ నష్టపోతున్నారు. ఈ ధోరణి స్వస్తి పలికి, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా వాణిజ్య పంటల వైపు అడుగులు వేస్తే లక్షల్లో లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు కొందరు ఆధునిక రైతులు. అలాంటి లాభసాటి పంటలలో నిమ్మగడ్డి సాగు ఒకటి. అతి తక్కువ ఖర్చుతో, కళ్లు చెదిరే లాభాలను తెచ్చిపెట్టే ఈ నిమ్మగడ్డి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మగడ్డి నుంచి తీసే నూనెకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. ఈ నూనెను రకరకాల సౌందర్య సాధనాలు, సువాసనభరిత సబ్బులు, పర్ఫ్యూమ్స్ మరియు అనేక రకాల ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అందుకే దీనికి మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధర ఉంటుంది.

నిమ్మగడ్డి సాగులోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. కరువు పీడిత ప్రాంతాల్లో, సరిగ్గా నీటి వసతి లేని బంజరు భూముల్లో కూడా ఈ పంటను బ్రహ్మాండంగా పండించవచ్చు. అడవి జంతువుల భయం, పురుగుల బెడద కూడా చాలా తక్కువ. నిమ్మగడ్డిని నాటడానికి ఫిబ్రవరి నుంచి జూలై నెలలు అత్యంత అనుకూలమైనవి. ఈ సమయంలో నాటుకుంటే మొక్కలు వేగంగా ఎదుగుతాయి.

సాధారణ పంటల్లా ప్రతి ఏటా విత్తనాలు వేయడం, దున్నడం లాంటి ఖర్చులు దీనికి ఉండవు.ఈ పంటను ఒక్కసారి నాటితే చాలు.. దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడి వస్తూనే ఉంటుంది.

ప్రతి సంవత్సరం 3 నుంచి 4 సార్లు గడ్డిని కోయవచ్చు. గడ్డి నుంచి నిమ్మకాయ సువాసన రావడం ప్రారంభమైందంటే.. పంట కోతకు సిద్ధమైందని అర్థం. కోసిన గడ్డిని బాగా ఎండబెట్టి పొడి రూపంలో అమ్ముకోవచ్చు. లేదా స్వయంగా చిన్న ఆయిల్ డిస్టిలేషన్ మిషన్ ఏర్పాటు చేసుకుని నూనె తయారు చేస్తే లాభాలు మరింత రెట్టింపవుతాయి.

మార్కెట్లో లీటర్ నిమ్మగడ్డి నూనె ధర రూ. 1,200 నుంచి రూ. 1,500 వరకు పలుకుతోంది. కేవలం ఒక హెక్టారు భూమిలో నిమ్మగడ్డి సాగు చేయడం ద్వారా, ఖర్చులు పోను ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు నికర లాభం సంపాదించవచ్చు. సంప్రదాయ పంటలతో నష్టపోతున్న రైతులకు నిమ్మగడ్డి సాగు ఒక వరప్రసాదం లాంటిది. తక్కువ పెట్టుబడి, శ్రమతో స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఇదొక బెస్ట్ బిజినెస్ ఐడియా.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story