Organic Farming: బడిలోనే ఆర్గానిక్ వ్యవసాయం.. ఫతేపూర్ సర్కారు స్కూల్ సరికొత్త ఆదర్శం!
Organic Farming: మహబూబ్నగర్ జిల్లా ఫతేపూర్ ప్రభుత్వ పాఠశాల సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.
Organic Farming: బడిలోనే ఆర్గానిక్ వ్యవసాయం.. ఫతేపూర్ సర్కారు స్కూల్ సరికొత్త ఆదర్శం!
Organic Farming: ప్రభుత్వ పాఠశాల అనగానే కేవలం పుస్తకాల చదువులు, పరీక్షలే గుర్తుకొస్తాయి. కానీ మహబూబ్నగర్ జిల్లాలోని ఒక సర్కారు బడి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా నిలుస్తోంది. అక్కడ విద్యార్థులకు అక్షరాల పాఠాలతో పాటు మట్టి విలువను, రైతు కష్టాన్ని తెలిపే వ్యవసాయ పాఠాలను కూడా నేర్పిస్తున్నారు. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు శ్రమ విలువను చిన్నారుల మనసుల్లో నాటుతూ ఈ స్కూల్ సరికొత్త ఆదర్శాన్ని చాటుతోంది.
మహబూబ్నగర్ గ్రామీణ మండలం ఫతేపూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల ఈ వినూత్న మార్పుకు వేదికైంది. ఈ స్కూల్లో చదువుతున్న 153 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా పాఠశాల ఆవరణలోనే 'న్యూట్రీ గార్డెన్' (Nutri Garden) ఏర్పాటు చేసి సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు. కాకర, బీర, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడు, సొరకాయలతో పాటు తోటకూర, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను కూడా విద్యార్థులే స్వయంగా సాగు చేస్తున్నారు.
విద్యార్థులు తమ చేతులతో పండించిన ఈ సేంద్రీయ కూరగాయలను ప్రతిరోజూ స్కూల్ మధ్యాహ్న భోజనంలో (Mid Day Meals) అధనపు వంటకంగా వండి పెడుతున్నారు. అలాగే స్కూల్ ఆవరణలోని జామ, నిమ్మ, నేరేడు, బొప్పాయి చెట్లకు కాసే పండ్లను కూడా పిల్లలకే పంచుతున్నారు. ఈ పౌష్టికాహారం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, బడి మానేసే వారి సంఖ్య (Dropouts) తగ్గి, రెగ్యులర్ అటెండెన్స్ పెరిగిందని హెడ్‌మిస్ట్రెస్ వెంకటమ్మ హర్షం వ్యక్తం చేశారు. తోట సంరక్షణ కోసం విద్యార్థులతో ప్రత్యేక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. తోటలోనే ప్రాక్టికల్‌గా జీవశాస్త్రం (Biology) పాఠాలను కూడా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
ఈ స్కూల్లో మరో అద్భుతమైన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. విద్యార్థులు తమ పుట్టినరోజు నాడు చాక్లెట్లు పంచేందుకు రూ. 200 నుండి రూ. 300 వృధా ఖర్చు చేయకుండా.. కేవలం రూ. 80తో ఒక పూలమొక్కను, కుండీని కొనుగోలు చేసి పాఠశాలకు బహుకరిస్తున్నారు. ఆ మొక్కలపై సదరు విద్యార్థి పేరు, పుట్టినరోజు తేదీని రాసి భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు ఇలా 200కు పైగా రకరకాల మొక్కలను విద్యార్థులు నాటి సంరక్షిస్తున్నారు.
చదువే కాకుండా ఆటలు, బాలల సభ వంటి వినూత్న కార్యక్రమాలు మరియు IFB డిజిటల్ ప్యానల్స్ ద్వారా డిజిటల్ బోధన అందిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఈ సమగ్ర బోధన వల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెరిగి, గత రెండేళ్లుగా ఈ పాఠశాల ఎస్సార్సీ (SSC) ఫలితాల్లో వరుసగా 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది.




