Anantapur: పుట్టగొడుగుల సాగుతో లక్షల ఆదాయం.. డిగ్రీ యువకుడి వండర్స్!
Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలానికి చెందిన బి.కామ్ యువకుడు ప్రవీణ్ కుమార్ పాల పుట్టగొడుగుల (Milky Mushroom) సాగుతో నెలకు మంచి ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలిచారు.
Anantapur: పుట్టగొడుగుల సాగుతో లక్షల ఆదాయం.. డిగ్రీ యువకుడి వండర్స్!
Anantapur: కరువుకు చిరునామాగా మారిన అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర నీటిద్దడి నెలకొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగాల వెంట పడకుండా ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నాడు ఒక డిగ్రీ యువకుడు. రాయదుర్గం తాలూకా డి.హిరేహాళ్ మండలం డిసల్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ బి.కామ్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులో మార్కెటింగ్ ఉద్యోగం చేశాడు. స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో "పాల పుట్టగొడుగుల సాగు" (Milky Mushroom Cultivation) ప్రారంభించి విజయవంతంగా రాణిస్తున్నారు.
వరిగడ్డి శుద్ధి
వరి గడ్డిని 2 నుంచి 3 అంగుళాల ముక్కలుగా కట్ చేసి, నీటిలో నానేసిన తర్వాత 80 నుండి 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సుమారు గంటపాటు ఉడకబెట్టి శుద్ధి చేస్తారు.
బెడ్ల తయారీ & విత్తనాలు వేయడం
ఉడకబెట్టిన గడ్డిలో తేమ శాతం సుమారు 60% ఉండేలా చూసుకుని, ప్లాస్టిక్ కవర్లలో వరిగడ్డి మరియు విత్తనాలను లేయర్లుగా వేసి రబ్బర్ బ్యాండ్‌తో మూసివేస్తారు.
చీకటి గది నిర్వహణ
తయారు చేసిన బెడ్లను చీకటి గదిలో (Dark Room) 21 నుంచి 25 రోజుల పాటు ఉంచుతారు.
కేసింగ్ & దిగుబడి
కవర్ల పైభాగాన్ని కట్ చేసి శుద్ధి చేసిన మట్టిని 2 అంగుళాల మందంలో పరుస్తారు (Casing). తేమను నిర్వహిస్తే మరో 14 రోజుల్లో చిన్న చిన్న పుట్టగొడుగులు వస్తాయి.
విపరీతమైన మార్కెట్ డిమాండ్ & లాభాలు:
పాల పుట్టగొడుగులలో డి-విటమిన్, క్యాల్షియం, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండటంతో పాటు ఆర్గానిక్ విధానంలో పండించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రవీణ్ తెలిపారు. రోజుకు 20 కిలోల నుంచి శుభకార్యాల సీజన్‌లో 50 కిలోల వరకు పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఇవి 4 రోజులు, ఫ్రిజ్‌లో 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. మార్కెట్లో కిలో రూ. 150 నుండి రూ. 200 వరకు విక్రయిస్తూ, 100% పెట్టుబడిపై మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. రాయచూర్, బళ్లారి, తిరుపతి, హైదరాబాద్ వంటి నగరాలకు కూడా ఎగుమతి చేస్తూ స్వయం ఉపాధితో పాటు తోటివారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు ప్రవీణ్.




