Farming: పుదీనా సాగుతో కాసుల వర్షం.. హెక్టారుకు 200 కిలోల తైలం.. లక్షల్లో ఆదాయం

వాణిజ్యపరంగా పుదీనా సాగు చేయాలనుకుంటున్నారా? తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే జపనీస్ పుదీనా రకాలు, సాగు పద్ధతులు గురించి తెలుసుకుందాం.

Naresh.k
Published on: 22 April 2026 2:14 PM IST
Farming
X

Farming

Mint Farming : సాధారణంగా మనం పుదీనాను వంటింట్లో సువాసన కోసం, చట్నీల కోసం వాడుతుంటాం. కానీ, వాణిజ్యపరంగా పుదీనా సాగు అనేది ఒక బంగారు గని. ముఖ్యంగా ఔషధాల తయారీలో, పాన్ మసాలాలు, టూత్ పేస్టులు మరియు సౌందర్య సాధనాల్లో పుదీనా తైలానికి విపరీతమైన డిమాండ్ ఉంది. భారతదేశంలో ముఖ్యంగా జపనీస్ పుదీనా సాగు రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

అత్యుత్తమ రకాలు

జపనీస్ పుదీనాలో శివాలిక్, కోసి వంటి పాత రకాల కంటే ఇప్పుడు సక్షమ్, కుశాల్ రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సక్షమ్ రకంలో 80% పైగా మెంథాల్ ఉంటుంది. హెక్టారుకు 250 కిలోల వరకు తైలాన్ని ఇస్తుంది. వరి కోతలు ఆలస్యమైనా, రబీ చివరలో కూడా కుశాల్ రకాన్ని సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండని ఎర్రనేలలు, నల్లనేలలు అత్యంత అనుకూలం. నేల ఉదజని సూచిక 6.5-8.5 మధ్య ఉండాలి. 20-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పుదీనా ఏపుగా పెరుగుతుంది.

నాటే పద్ధతి

పుదీనాను వేర్లు లేదా పిలకల ద్వారా సాగు చేస్తారు. నేరుగా పిలకలను పొలంలో నాటుకోవచ్చు. వరుసల మధ్య 60 సెం.మీ దూరం ఉండాలి. ముందుగా నారుమడిలో పెంచి, ఆరు ఆకులు వచ్చాక ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఎండాకాలంలో ప్రతి 7-10 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి. ఎండు ఆకులతో మల్చింగ్ చేయడం వల్ల 25% నీరు ఆదా అవ్వడమే కాకుండా కలుపు కూడా తగ్గుతుంది. పుదీనా వరుసల మధ్య మినుము, కంది లేదా అలసంద వంటి పంటలు వేయడం వల్ల నేలకు నత్రజని అందుతుంది. అలాగే శ్రీగంధం, మలబారు వేప తోటల్లో అంతర పంటగా వేస్తే హెక్టారుకు రూ. 15,000 నుండి 20,000 వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.

కోత & తైలం

నాటిన 100 రోజులకు మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత ప్రతి 60-70 రోజులకు కోతలు కోయవచ్చు. అడుగు ఆకులు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు కోత మొదలు పెట్టాలి. కోసిన ఆకులను 4-5 గంటలు నీడలో ఆరబెట్టి, స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీయాలి. ఈ ప్రక్రియకు సుమారు 4 గంటల సమయం పడుతుంది.

దిగుబడి - లాభాలు

హెక్టారుకు సగటున 20-40 టన్నుల ఆకులు లభిస్తాయి. వీటి ద్వారా 125-200 కిలోల తైలం పొందవచ్చు. మార్కెట్లో మెంథాల్ ఆయిల్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా, రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే పుదీనా సాగులో మంచి లాభాలు గడించవచ్చు.

Naresh.k

Naresh.k

Next Story