MP Vishweshwar: రూ.25 పెట్టుబడికి.. రూ. 400 లాభం.. ఎంపీ విశ్వేశ్వర్ వ్యవసాయం చూశారా?
MP Vishweshwar: చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో పాల పుట్టగొడుగుల సాగుపై ఒక ప్రత్యేక డెమో ప్రాజెక్టును ప్రారంభించారు.
MP Vishweshwar: రూ.25 పెట్టుబడికి.. రూ. 400 లాభం.. ఎంపీ విశ్వేశ్వర్ వ్యవసాయం చూశారా?
MP Vishweshwar: ఆయనో అగ్రశ్రేణి వ్యాపారవేత్త, హైటెక్ టెక్ ప్రెన్యూర్, అంతకుమించి ప్రజాప్రతినిధి. కానీ, వీటన్నింటికీ మించి ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. ఆయనే చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎప్పుడూ లగ్జరీ లైఫ్‌కే పరిమితం కాకుండా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపించడంలో ఆయన రూటే వేరు. తాజాగా తన వ్యవసాయ క్షేత్రంలో రైతులు, యువత కోసం ఒక అద్భుతమైన ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
అదే పాల పుట్టగొడుగుల సాగు. కేవలం రూ. 20 నుండి రూ. 25 పెట్టుబడి పెడితే.. ఏకంగా రూ. 200 నుండి రూ. 400 వరకు ఆదాయం తెచ్చిపెట్టే ఈ సరికొత్త సాగు విధానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక స్పెషల్ డెమో ప్రాజెక్టును ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాంప్రదాయ పంటల కంటే తక్కువ స్థలంలో, ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే ఈ సరికొత్త బిజినెస్ ఐడియా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మారుతున్న కాలంతో పాటు వ్యవసాయ సాంకేతికత కూడా మారుతోంది. వరి, మొక్కజొన్న, చెరుకు వంటి పంటలకు ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ స్థలం, నీరు కావాలి. కానీ, పరిమిత స్థలంలో, తక్కువ శ్రమతో ఏడాది పొడవునా డిమాండ్ ఉండే పంట ఏదైనా ఉందంటే అది పుట్టగొడుగులు మాత్రమే. సాధారణంగా మార్చి, ఏప్రిల్ తర్వాత వేసవి ఉష్ణోగ్రతల వల్ల దీని సాగు కష్టమనుకుంటారు. ఎందుకంటే దీనికి 28 నుండి 38 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. అయితే కొన్ని ప్రత్యేక సూత్రాలు పాటిస్తే వేసవిలోనూ బంపర్ దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
10 కిలోల వరి గడ్డి లేదా చెరకు పిప్పిని 90 లీటర్ల నీటిలో నానబెట్టాలి. ఒక బకెట్‌లో 10 లీటర్ల నీరు తీసుకుని అందులో 10 గ్రాముల బావిస్టిన్, 5 మి.లీ ఫార్మలిన్ కలిపి ఆ ద్రావణాన్ని డ్రమ్ములో పోయాలి. దీనివల్ల గడ్డి పూర్తిగా శుద్ధి అవుతుంది. డ్రమ్‌పై మూత పెట్టి 12 నుండి 16 గంటల పాటు ఉంచాలి. శుద్ధి చేసిన గడ్డిని బయటకు తీసి, సరిగ్గా ఆరబెట్టాలి. మష్రూమ్ సాగుకు గాలిలో 80 నుండి 90 శాతం తేమ అవసరమైనప్పటికీ,
పొట్టు మాత్రం పొడిగా ఉండాలి. ప్రతి ఒక కిలోగ్రాము శుద్ధి చేసిన పొట్టుకు 40 నుండి 50 గ్రాముల పుట్టగొడుగుల విత్తనాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని పీపీ బ్యాగుల్లో నింపి, గట్టిగా కట్టి ఒక చీకటి గదిలో ఉంచాలి. 2 నుండి 3 వారాల పాటు గది ఉష్ణోగ్రత 28-38 డిగ్రీల సెల్సియస్, తేమ 80-90% ఉండేలా చూసుకోవాలి. కొన్ని రోజులకు సంచి అంతా తెల్లటి శిలీంధ్రపు వలలా మారుతుంది. ఆ సమయంలో పాత ఆవు పేడ లేదా వర్మీకంపోస్ట్‌తో పైపొర వేయడం చేసి, తేలికగా నీటిని స్ప్రే చేయాలి.
కేవలం ఒక కిలోగ్రాము పొట్టు, 50 గ్రాముల విత్తనాలతో 1 కిలోగ్రాము తాజా మిల్కీ మష్రూమ్స్ ఉత్పత్తి అవుతాయి. ఒక కిలో పుట్టగొడుగుల ఉత్పత్తికి అయ్యే ఖర్చు కేవలం రూ. 20 నుండి రూ. 25 మాత్రమే. మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ కారణంగా కేజీ మష్రూమ్స్ రూ. 200 నుండి రూ. 400 వరకు పలుకుతాయి. పోషక విలువలు పుష్కలంగా ఉండే మిల్కీ వైట్ మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
తక్కువ పెట్టుబడితో గృహిణులు, నిరుద్యోగ యువత సొంతంగా ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించి అద్భుతమైన ఉపాధి పొందవచ్చని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిరూపించి చూపిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయంతో నష్టపోతున్న రైతులకు ఈ మిల్కీ మష్రూమ్ సాగు నిజంగానే ఒక సరికొత్త కామధేనువు అనడంలో ఎలాంటి సందేహం లేదు!




