Kharif Crops: మృగశిర కార్తె వచ్చేసింది..ఈ పంటలు వేస్తే లాభాల జాతరే!

Kharif Crops: మృగశిర కార్తెతో దక్షిణ భారతదేశంలో ఖరీఫ్ సాగు పనులు మొదలవుతాయి.

Naresh.k
Published on: 4 Jun 2026 2:17 PM IST
Kharif Crops
X

Kharif Crops: మృగశిర కార్తె వచ్చేసింది..ఈ పంటలు వేస్తే లాభాల జాతరే!

Kharif Crops: దక్షిణ భారతదేశంలో వర్షాకాల వ్యవసాయ పనులకు మృగశిర కార్తెనే తొలి అడుగు. సాధారణంగా జూన్ నెల ప్రారంభంలో వచ్చే ఈ కార్తెతోనే రైతులు నాగలి పట్టి పొలాల్లోకి అడుగుపెడతారు. ఈ సమయంలో కురిసే తొలకరి వర్షాలు నేలను చల్లబరిచి, విత్తనాలు వేగంగా, ఆరోగ్యంగా మొలకెత్తడానికి అద్భుతమైన తేమను అందిస్తాయి. మరి ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కాసుల వర్షం కురిపించే ఆ లాభదాయకమైన పంటలు ఏంటో, నిపుణులు చెబుతున్న సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెల్ల బంగారం పత్తి

మృగశిర కార్తెలో మెజారిటీ రైతులు మొగ్గు చూపేది పత్తి సాగుకే. ఈ సమయంలో వర్షాలు సక్రమంగా కురిస్తే పత్తి మొక్కలు బలంగా ఎదిగి ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో ఈ కార్తెలో వేసిన పత్తి పంటకు నీటి అవసరం కొంత వరకు తగ్గుతుంది. మార్కెట్ డిమాండ్‌కు తగ్గ సరైన రకాలను ఎంపిక చేసుకుంటే ఎకరానికి భారీ లాభాలు సాధించవచ్చు.

తక్కువ కాలంలో ఎక్కువ లాభం.. మొక్కజొన్న

తక్కువ వ్యవధిలో పంట చేతికి రావడం, మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉండటం మొక్కజొన్న ప్రత్యేకత. వర్షాధార ప్రాంతాల్లో కూడా ఈ సాగు విజయవంతంగా సాగుతుంది. మృగశిర తొలకరి తేమ తగిలితే మొక్కజొన్న విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి.

భరోసానిచ్చే పప్పుధాన్యాలు

మృగశిర వర్షాల తడి తర్వాత కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాల సాగు అత్యంత లాభదాయకం. ఇవి తక్కువ నీటితో, ఎండలను తట్టుకుని పెరుగుతాయి. వీటికి అదనపు ప్రయోజనం ఏంటంటే.. ఇవి నేలలో నత్రజనిని స్థిరపరిచి భూసారాన్ని విపరీతంగా పెంచుతాయి. ఒకవేళ వర్షాలు తక్కువైనా ఇవి రైతును నష్టపోనివ్వవు.

ఎర్ర నేలలకు కేరాఫ్ వేరుశెనగ

ఎర్ర నేలలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మృగశిర కార్తెలో వేరుశెనగ విత్తడం ఉత్తమం. భూమిలో తగినంత పదును ఉన్నప్పుడు విత్తనాలు వేస్తే మొక్కలు బలంగా త్వరగా ఎదుగుతాయి. వాతావరణం అనుకూలిస్తే వేరుశెనగ రైతులకు తిరుగులేని ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

ట్రెండింగ్‌లో ఉన్న చిరుధాన్యాలు

వాతావరణ మార్పులను తట్టుకుంటూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే జొన్న, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాల సాగుపై ఇప్పుడు రైతులు బాగా దృష్టి పెడుతున్నారు. మృగశిర కార్తెలో విత్తితే వీటికి చీడపీడల తక్కువగా ఉండి మంచి దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వీటికి హెల్త్ క్రేజ్ వల్ల డిమాండ్ కూడా భారీగా ఉంది.

నీటి వనరులుంటే వరి నారుమళ్లు

బోర్లు లేదా కాల్వల ద్వారా నీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు ఈ సమయంలో నారుమళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కార్తెలో పోసే నారు చాలా ఆరోగ్యంగా పెరిగి, ప్రధాన పొలంలో నాట్లు వేసే సమయానికి బలంగా తయారవుతుంది.

పంటను ఎంపిక చేసుకునే ముందు మీ ప్రాంతంలోని వాతావరణం, నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోండి.ఏ పంట వేసినా సరే, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇది ప్రారంభ దశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు లేదా కేవీకే నిపుణులు సూచించిన అధిక దిగుబడినిచ్చే అధీకృత విత్తన రకాలను మాత్రమే కొనుగోలు చేయండి. సమతుల్య ఎరువుల వినియోగం, సకాలంలో కలుపు నివారణ చర్యలు చేపడితే దిగుబడి మరింత పెరుగుతుంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story