Natural Farming: కేవలం 5% నీటితో వరి సాగు.. రైతు విజయరామ్ సంచలన ప్రయోగం!

Natural Farming: వరి సాగుకు విపరీతంగా నీరు కావాలనేది కేవలం అపోహ మాత్రమేనని నిరూపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్.

Arun Chilukuri
Published on: 15 July 2026 11:21 AM IST
Natural Farming
X

Natural Farming: కేవలం 5% నీటితో వరి సాగు.. రైతు విజయరామ్ సంచలన ప్రయోగం!

Natural Farming: రసాయన ఎరువుల ఖర్చులు, కలుపు మందుల వాడకంతో విసిగిపోయిన రైతులకు ప్రకృతి వ్యవసాయం ఒక వరం లాంటిది. అయితే ఈ సాగుపై రైతుల్లో ఎన్నో అపోహలు, సందేహాలు ఉన్నాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ, వరి సాగుకు ఎంతో నీరు కావాలనేది కేవలం భ్రమ అని నిరూపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పూర్తిగా ఆచరిస్తూ.. వికారాబాద్ జిల్లా దారూరు మండలం బూరుగడ్డ గ్రామంలోని తన 43 ఎకరాల క్షేత్రాన్ని ఒక అద్భుత ప్రయోగశాలగా మార్చారు. మొక్కకు కావాల్సింది నీరు కాదు.. కేవలం తేమ మాత్రమే అనే సూత్రాన్ని నమ్మి ఆయన సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం:

95 శాతం నీరు, విద్యుత్ ఆదా.. ఆరుతడి వరి సాగు!

తెలంగాణ, రాయలసీమ వంటి తక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వరి పండించడం కష్టమనే భావనను విజయరామ్ తిప్పికొట్టారు. సాధారణంగా వరి చేలో 2 నుంచి 6 అంగుళాల నీరు నిలబెట్టాలనే అపోహను పక్కనబెట్టి, కేవలం 5 శాతం నీటితోనే వరి సాగును లాభసాటిగా మార్చారు. దీనివల్ల భూగర్భ జలాలు తరిగిపోకుండా కాపాడటంతో పాటు 95 శాతం విద్యుత్‌ను కూడా ఆదా చేయవచ్చని ప్రాక్టికల్‌గా నిరూపించారు.

వినూత్న సాగు పద్ధతి – అంతర పంటల జోడి..

విజయరామ్ తన క్షేత్రంలో దేశవాళీ వరి రకమైన ‘రత్నచోడి’ని సాగు చేస్తున్నారు. వరి నాట్లలో మొక్కకు మొక్కకు మధ్య సాధారణ దూరం కాకుండా 18 అంగుళాల (అడుగున్నర) నుంచి 3 అడుగుల వరకు దూరం ఉంచారు. దీనివల్ల చేలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించి దోమపోటు లేదా ఇతర తెగుళ్లు వచ్చే అవకాశమే ఉండదు. అడుగున్నర దూరం ఉన్న వరి సాళ్ల మధ్యలో మొక్కజొన్న, పెసలు, తోటకూర జల్లారు. పెసర పంట ద్వారా ప్రధాన వరి పంటకు కావాల్సిన నైట్రోజన్ సహజసిద్ధంగా అందుతుంది.

ఈ వరి క్షేత్రంలో మూడో రకంగా భూగర్భంలో పండే ‘బ్లాక్ క్యారెట్’ (నల్ల క్యారెట్) ను రాజస్థాన్ నుంచి తెప్పించి ప్రయోగాత్మకంగా వేశారు. నల్లటి విత్తనాలు, నల్లటి పంటలలో క్యాన్సర్‌ను నిరోధించే శక్తి ఎక్కువగా ఉంటుందని విజయరామ్ తెలిపారు.

ఇవే కాకుండా వరి చేలో అంతర పంటలుగా పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), పల్లీలు (వేరుశనగ), టమాటా మరియు చుట్టూ రక్షణ పంటగా బంతి పూలను సాగు చేస్తున్నారు. దసరా, దీపావళి సీజన్లలో బంతి పూల ద్వారా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే వరి చేలో తూర్పు నుంచి పడమరకు ప్రతి 25 అడుగులకు ఒక కొబ్బరి మొక్కను నాటారు. దీనివల్ల పంటపై నీడ పడకుండా 'డాన్సింగ్ షేడ్' లాగా పని చేస్తుందని వివరించారు.

ఎద్దుల సేద్యమే శరణ్యం.. చిన్న రైతుల కోసమే ఈ ఉద్యమం!

ఈ మొత్తం ప్రయోగంలో ట్రాక్టర్లు కాకుండా ఎద్దుల సహాయంతో గుంటుకలు తోలి కలుపును పూర్తి స్థాయిలో అదుపు చేశారు. భారీ వర్షాలు పడినా ఎద్దుల సేద్యం వల్ల భూమి పొంగి నీరంతా భూమిలోకి ఇంకిపోవడంతో చిన్న చిన్న క్యారెట్ విత్తనాలు కూడా కొట్టుకుపోకుండా మొలకెత్తాయని విజయరామ్ నిరూపించారు.

ఈ ప్రకృతి వ్యవసాయ విధానం 50 లేదా 100 ఎకరాలు ఉన్న పెద్ద రైతుల కోసం కాదని.. కేవలం 2 నుంచి 5 ఎకరాలు ఉండి, ఇంట్లోని నలుగురు సభ్యులు సొంతంగా కష్టపడే చిన్న రైతు కుటుంబాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల కూలీల ఖర్చు లేకుండా, అదనపు అంతర పంటల ద్వారా చేతినిండా డబ్బులు సంపాదించుకుంటూ గ్రామాలు వదిలి నగరాలకు వలస వెళ్లే పరిస్థితిని అరికట్టవచ్చని విజయరామ్ రైతులకు పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story