Niger Seed: అరకులో కాసులు కురిపిస్తున్న పంట!

Niger Seed: అల్లూరి జిల్లా పాడేరు, అరకు లోయల్లో సాగవుతున్న సాంప్రదాయ వలిసె పంట విశేషాలు.

Naresh.k
Published on: 20 May 2026 1:45 PM IST
Niger Seed
X

Niger Seed: అరకులో కాసులు కురిపిస్తున్న పంట!

Farming : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు లోయల గుండా ప్రయాణిస్తుంటే కొండల వాలుల్లో పసిడి కాంతులు వెదజల్లుతూ కనువిందు చేసే పసుపు రంగు పూల తోటలు పలకరిస్తాయి. కాసేపు ఆ పొలాల్లో నడిస్తే మనసుకు చెప్పలేని హాయి లభిస్తుంది. దూరం నుంచి చూస్తే ఎవరో పసుపు ఆరబోసినట్లుగా కనిపించే ఆ అద్భుతమైన పసిడి వనమే వలిసె పంట. తూర్పు కనుమల ఒడిలో, ప్రకృతి ఒడిదుడుకులను తట్టుకుంటూ సాగవుతున్న ఈ సంప్రదాయ నూనెగింజల పంట గిరిజన రైతులకు ఆర్థిక భరోసానిస్తూ, వినియోగదారులకు అద్భుతమైన ఆరోగ్యాన్ని పంచుతోంది.

తూర్పు కనుమల్లో వలిసె సాగుకు కారణాలేంటి?

సముద్ర మట్టానికి సుమారు 900 నుండి 1400 మీటర్ల ఎత్తులో ఉండే పాడేరు ఏజెన్సీ ప్రాంత వాతావరణం, అక్కడి ఎర్రమట్టి నేలలు ఈ పంటకు అత్యంత అనుకూలం. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం అసలు అవసరమే లేదు. కొండలపై పండించే సామలు, రాగులు, జొన్నల మధ్యలో దీనిని అంతర పంటగా సులువుగా సాగు చేయవచ్చు. వలిసె మొక్కల వేర్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచడం వల్ల కొండ వాలుల్లో నేల కోత తగ్గుతుంది. గింజలు కోసిన తర్వాత మిగిలే వ్యర్థాలు పశువుల మేతగా, భూమికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం అరకు, పాడేరు పరిసరాల్లో దాదాపు 14,000 ఎకరాల్లో, అల్లూరి జిల్లా వ్యాప్తంగా సుమారు 25,000 ఎకరాల్లో గిరిజన రైతులు ఈ పంటను లాభసాటిగా పండిస్తున్నారు.

వలిసె నూనెలో పోషక విలువలు

మార్కెట్లో లభించే సాధారణ రిఫైన్డ్ నూనెల కంటే సాంప్రదాయ పద్ధతిలో తీసే వలిసె నూనె ఎంతో శ్రేష్ఠమైనది. దీనిలో ఉండే అరోమా ఆయిల్ కంటెంట్ వల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నూనెలో ఒమేగా-3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. ఆయుర్వేదంలో వలిసె నూనెను మర్దన నూనెగా వాడతారు. కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పుల నుంచి ఇది సహజ ఉపశమనాన్ని ఇస్తుంది.

విటమిన్-ఇ, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల పొడి చర్మం, అలర్జీల వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు మెత్తగా మారి, జుట్టు రాలడం తగ్గుతుంది. గిరిజన ప్రాంతాల్లో ఉప్పు తప్ప అన్నీ సొంతంగా పండించుకునే సంస్కృతి ఉంది. ఆ క్రమంలోనే వంట నూనె అవసరాల కోసం ఈ వలిసెను వాడుతున్నారు. సాధారణ నూనెలతో పోలిస్తే వలిసె నూనె వంటల్లో సగమే పడుతుంది. దీనితో వండిన ఏ కూర అయినా అద్భుతమైన సువాసనతో, ఎంతో రుచిగా ఉంటుంది. చలికాలంలో కూడా గడ్డకట్టకపోవడం ఈ నూనె ప్రత్యేకత.

స్థానిక గిరిజన సంతల్లో ఈ గింజలకు, నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. గింజల కేజీ ధర 60 నుండి 95 రూపాయిల వరకు ఉంటుంది. నూనె ధర అయితే లీటరు 260 నుండి 380 రూపాయిల వరకు ఉంది. భారత్‌లోనే కాకుండా యూరప్, ఆఫ్రికా, శ్రీలంక వంటి దేశాలకు కూడా ఈ గింజలు ఎగుమతి అవుతుంటాయి. ఒకప్పుడు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితమైన గిరిజన రైతులు, ఇప్పుడు విద్యావంతులై ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వలిసె వంటి లాభసాటి పంటల వైపు అడుగులు వేస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story