Ragi Cultivation Guide: తక్కువ నీటితో రాగి సాగు.. లాభాల బాటలో రైతులు!

Ragi Cultivation Guide: రాగి (తైదలు) పంట సాగులో అధిక దిగుబడులు సాధించడానికి అనుకూలమైన సమయాలు, విత్తన రకాలు, నారు నాటే పద్ధతులు మరియు చీడపీడల నివారణ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 13 July 2026 11:06 AM IST
Ragi Cultivation Guide
X

Ragi Cultivation Guide: తక్కువ నీటితో రాగి సాగు.. లాభాల బాటలో రైతులు!

Ragi Cultivation Guide: అనాదిగా మన రైతులు సాగు చేస్తున్న మేలైన చిరుధాన్యపు (మిల్లెట్స్) పంటల్లో రాగులు లేదా తైదలు ముఖ్యమైనవి. ప్రస్తుతం మార్కెట్‌లో రాగులకు మంచి గిరాకీ ఉండటంతో పాటు అధిక ధర కూడా పలుకుతోంది. ముఖ్యంగా వరి వాగుల్లో నీటి లభ్యత తగ్గినప్పుడు, కొద్దిపాటి చవుడు సమస్య ఉన్న పరిస్థితుల్లో కూడా రాగి పంటను సాగు చేసుకొని రైతులు మంచి లాభాలను ఆర్జించవచ్చు.

రాగి పంటను ఏడాదిలో మూడు కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ అయితే జూలై మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు, రబీ సీజన్ అయితే అక్టోబర్ చివరి వారం నుండి విత్తుకోవచ్చు. అలాగే వేసవి కాలంలో సాగు చేయాలనుకునే వారు ఫిబ్రవరి మొదటి పక్షం లోపే నాటుకోవాల్సి ఉంటుంది. ఈ పంటను తేలికపాటి ఇసుక నేలలు, బరువైన నేలలతో పాటు చవుడు భూముల్లోనూ సాగు చేయవచ్చు.

రాగి సాగులో భారతి, శ్రీ చైతన్య, మారుతి, హేమ వంటి రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి. నారుమడి పద్ధతిలో 5 సెంట్లలో నారు పోయడానికి 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఒకవేళ పొలంలో నేరుగా వెదజల్లే పద్ధతి అయితే ఎకరాకు 3 నుండి 4 కిలోల విత్తనం సరిపోతుంది. బాగా దుక్కి చేసిన నేలలో రాగి విత్తనాన్ని, సన్నని ఇసుకను 1:3 నిష్పత్తిలో కలిపి నేరుగా కూడా విత్తుకోవచ్చు.

మొక్కలు నాటే సమయంలో రకాలను బట్టి నారు వయస్సును గమనించాలి. 85 నుండి 90 రోజుల స్వల్పకాలిక రకాలకైతే 21 రోజుల వయసున్న నారును, 105 నుండి 120 రోజుల దీర్ఘకాలిక రకాలకైతే 30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. నాటేటప్పుడు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.

రాగి పంట పూత దశకు వచ్చే సమయంలో మరియు గింజ పాలు పోసుకునే దశల్లో పొలం అస్సలు నీటి ఎద్దడికి గురికాకుండా తగిన తడులు అందించాలి. ఈ పంటను ప్రధానంగా గులాబీ రంగు పురుగు మరియు అగ్గి తెగులు ఆశించే ప్రమాదం ఉంది. గులాబీ రంగు పురుగు లార్వాలు కాండాన్ని తొలిచి తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. కంకి దశలో ఇది ఆశిస్తే తెల్లకంకులు ఏర్పడతాయి.

అలాగే అగ్గి తెగులు ఆశించినప్పుడు ఆకులు, కనుపులపై దారపు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. కనుపులపై తెగులు తీవ్రత ఉంటే అవి విరిగిపోతాయి, వెన్నుపై ఆశిస్తే గింజలు తాలుగా మారిపోతాయి. కాబట్టి రైతులు సకాలంలో తగిన నివారణ చర్యలు చేపట్టాలి.

గింజలు ముదురు రంగులోకి మారి, వెన్నుల దగ్గర ఆకులు పండినట్లుగా కనిపించినప్పుడు పంట కోతకు వచ్చిందని గుర్తించాలి. ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది కాబట్టి, రెండు దశల్లో కంకులను కోయాల్సి ఉంటుంది. కోసిన కంకులను పొలంలోనే చొప్ప తీసి 2 నుండి 3 రోజులు ఆరబెట్టాలి. బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టి గానీ లేదా ట్రాక్టర్ నడపడం ద్వారా గానీ గింజలను వేరు చేయవచ్చు. ఆ తర్వాత గాలికి తూర్పారబట్టి నాణ్యమైన రాగి గింజలను నిల్వ చేసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story