Rajanna Sircilla: ఎకరం 20 గుంటల్లో 10 రకాల పంటలు.. నెలకు రూ.50 వేల ఆదాయం! రైతు కృషికి కలెక్టర్ ఫిదా

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లికి చెందిన రైతు సత్యారెడ్డి ఎకరం 20 గుంటల్లో 10 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 11:13 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: ఎకరం 20 గుంటల్లో 10 రకాల పంటలు.. నెలకు రూ.50 వేల ఆదాయం! రైతు కృషికి కలెక్టర్ ఫిదా

Rajanna Sircilla: సంప్రదాయ వరి సాగుకు భిన్నంగా ఆలోచించి, వినూత్న పద్ధతులతో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఓ రైతు ఇతర అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లికి చెందిన రైతు సత్యారెడ్డి సాగు విధానాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అభినందించారు.

రైతు సత్యారెడ్డి తన ఎకరం 20 గుంటల పొలంలో ఏకంగా 10 రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. కోతుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. విడతల వారీగా పంటలు పండిస్తూ, ప్రతి వారం మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ వినూత్న సాగు ద్వారా సత్యారెడ్డి నెలకు సుమారు రూ.50,000 వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.

సత్యారెడ్డి పొలాన్ని సందర్శించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆయన సాగు విధానాన్ని మెచ్చుకున్నారు. కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి పంటపైనే ఆధారపడితే ఆశించిన ఆదాయం రాదని, ఇతర రైతులు కూడా ఇలాంటి ప్రత్యామ్నాయ సాగుల వైపు రావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించిన కీలక విషయాలు:

భూగర్భ జలాల తగ్గుదల: గంభీరావుపేటలో గతేడాది అక్టోబర్ 2025లో 5.09 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం, ఇప్పుడు 8.39 మీటర్లకు పడిపోయిందని కలెక్టర్ తెలిపారు. అందరూ బోర్లపైనే ఆధారపడితే నీటి మట్టం మరింత లోతుకు వెళ్లి, ఖర్చుతో పాటు విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని హెచ్చరించారు.

ఆయిల్ పామ్, ఇంటర్ క్రాపింగ్: ఆయిల్ పామ్ సాగుకు మంచి డిమాండ్ ఉందని, ప్రస్తుతం ఎంఎస్పీ (MSP) రూ.24,000 వరకు పెరిగిందని పేర్కొన్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైందని, పంటకు వెంటనే గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. మొక్కల మధ్య ఇంటర్ క్రాపింగ్‌గా కూరగాయలు, కంది, పెసర వంటి పంటలు వేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటిని, కరెంట్‌ను వృథా చేయకుండా పొదుపు చేయాలని కలెక్టర్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.