సీమలో కరువు దెబ్బకు ఖరీఫ్‌ కుదేలు.. రైతులు వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలివే!

రాయలసీమలో ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్‌ సాగు పడిపోయింది.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 12:40 PM IST
సీమలో కరువు దెబ్బకు ఖరీఫ్‌ కుదేలు.. రైతులు వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలివే!
X

సీమలో కరువు దెబ్బకు ఖరీఫ్‌ కుదేలు.. రైతులు వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలివే!

రాయలసీమ ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ సీజన్ ముగుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయి రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తీవ్ర కరువు పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు రైతులు పాటించాల్సిన ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మల్లేశ్వరి కీలక వివరాలు వెల్లడించారు.

రాయలసీమలో సాగు పరిస్థితి & వర్షపాత లోటు:

అనంతపురం జిల్లా: సాధారణంగా ఖరీఫ్‌లో 3.43 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 40% (సుమారు 39,000 హెక్టార్లు) వరకు మాత్రమే సాగైంది. జిల్లాలోని 32 మండలాలకు గాను 22 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉంది.

సత్యసాయి జిల్లా: 42% మాత్రమే సాగు నమోదైంది.

అన్నమయ్య జిల్లా: రాయలసీమలోనే అత్యంత తక్కువగా కేవలం 10% విస్తీర్ణంలో మాత్రమే సాగు జరిగింది.

ఇతర జిల్లాలు: కర్నూలు, తిరుపతి జిల్లాల్లో 80% నుండి 90% వరకు సాగు జరగగా, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది.

వర్షపాత లోటు: జూలై నెలలో ఏకంగా 70% లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులోనూ ఇప్పటివరకు 30% లోటు కొనసాగుతోంది.

ఆగస్టులో వేయదగిన ప్రత్యామ్నాయ పంటలు:

వేరుశనగ వద్దు - కంది సాగు:

వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సమయంలో వేరుశనగ సాగు చేయవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆగస్టు 15 వరకు కంది పంట విత్తుకోవడానికి అవకాశం ఉంది.

చిరుధాన్యాలు:

తక్కువ వర్షపాతంలో 60 నుండి 80 రోజుల్లో చేతికి వచ్చే కొర్ర, సజ్జ, జొన్న, మేత జొన్న పంటలు సాగు చేసుకోవడం మంచిది. ఇవి పంట దిగుబడితో పాటు పశువుల మేతకు కూడా ఉపయోగపడతాయి.

అపరాల పంటలు:

ఎర్ర నేలల్లో తక్కువ నీటితో పండే పెసర, అలసంద, ఉలవలు వేసుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో మినుములు (ఉద్దులు) సాగు చేసుకోవచ్చని తెలిపారు.

రైతులకు శాస్త్రవేత్తల కీలక సూచనలు:

కంది సాగులో యాజమాన్యం: వర్షాభావం వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి, కంది విత్తే సాలుకి సాలుకి మధ్య దూరాన్ని 3 అడుగులకు తగ్గించుకోవాలి. అలాగే మొక్కల మధ్య జానెడు (20 సెం.మీ) దూరం ఉండేలా ఒత్తులు తీసుకోవాలి.

నీటి సంరక్షణ & బోర్ల వినియోగం: భూగర్భ జలాలు పడిపోతున్నందున బోరుబావుల నీటిని పొదుపుగా వాడాలి. డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను మాత్రమే వినియోగించాలి.

ఉద్యాన తోటల రక్షణ: అరటి, చీనీ, దానిమ్మ తోటల్లో కలుపు మొక్కల వల్ల తేమ వృథా కాకుండా చూసుకోవాలి. ఉద్యానవన శాఖ సబ్సిడీపై అందిస్తున్న 'వీడ్ మాట్స్' (Weed Mats) అమర్చుకోవడం ద్వారా నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు.

స్వల్పకాలిక పంటలు: పరిమితంగా ನೀరున్న చోట నెల లేదా నెలన్నర రోజుల్లో చేతికి వచ్చే కొత్తిమీర, ఆకుకూరలు సాగు చేయడం శ్రేయస్కరం.

క్షేత్రస్థాయిలో అవగాహన చర్యలు:

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 'ఎల్‌నినో కంబాట్ టీమ్స్' (El Nino Combat Teams) ను ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థుల బృందాలు ప్రతి గ్రామం, రైతు సేవా కేంద్రాల (RSK) వద్ద పర్యటిస్తూ రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు మరియు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story