గడ్డిమందు పారక్వాట్ నిషేధంపై కేంద్రం గెజెట్.. సీఎం రేవంత్ రెడ్డి చొరవకు దక్కిన విజయం!

ప్రమాదకర కలుపు నివారణ మందు 'పారక్వాట్'ను దేశవ్యాప్తంగా నిషేధిస్తూ కేంద్రం గెజెట్ ఇవ్వడంపై తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 16 July 2026 11:53 AM IST
గడ్డిమందు పారక్వాట్ నిషేధంపై కేంద్రం గెజెట్.. సీఎం రేవంత్ రెడ్డి చొరవకు దక్కిన విజయం!
X

గడ్డిమందు పారక్వాట్ నిషేధంపై కేంద్రం గెజెట్.. సీఎం రేవంత్ రెడ్డి చొరవకు దక్కిన విజయం!

దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీల ప్రాణాలను బలితీసుకున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందు (గడ్డిమందు) 'పారక్వాట్' (Paraquat)ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు సునీల్ కుమార్, గోపాల్ రెడ్డిలు మాట్లాడారు.

గడ్డిమందుల వల్ల జరుగుతున్న ప్రాణనష్టంపై వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో, మార్చి 16న (2026) తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని కోదండరెడ్డి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని అసెంబ్లీలో ప్రస్తావించి రాష్ట్ర పరిధిలో తాత్కాలిక నిషేధం విధించారని తెలిపారు. నాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఒత్తిడి ఫలితంగానే నేడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పారక్వాట్‌ను నిషేధిస్తూ గెజెట్ విడుదల చేసిందని, ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

పారక్వాట్ గడ్డిమందు వల్ల దేశవ్యాప్తంగా 4,252 మంది చనిపోతే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 200 మందికి పైగా బలయ్యారని కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషపూరితమైన కలుపుమందు కొట్టిన గడ్డిని పశువులు తింటే వాటి పళ్ళు సైతం ఊడిపోతున్నాయని, దీని ప్రభావం వల్ల రైతులు కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మందు తాగిన వారిలో ఇప్పటివరకు ఎవరూ బతికిన దాఖలాలు లేవని, ఖమ్మం, పెద్దపల్లి ఆసుపత్రుల్లో జరిగిన ఘోరాలే ఇందుకు నిదర్శనమని ఆవేదన చెందారు. పారక్వాట్‌తో పాటు గ్లైఫోసేట్, హెచ్‌టీబీటీ పత్తి విత్తనాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో నిషేధం విధించినప్పటికీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రమాదకరమైన గడ్డిమందులు ఇంకా అందుబాటులో ఉండటంపై కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ స్పందించారు. ఆయా సంస్థల ప్రతినిధులను పిలిపించి తెలంగాణలో ఈ మందును విక్రయించవద్దని, స్టాక్‌ను విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించామన్నారు. 1968 ఇన్సెక్టిసైడ్స్ చట్టం ప్రకారం పురుగుల మందుల నియంత్రణ కేంద్రం చేతిలోనే ఉంటుందని, వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిధిలోకి తెస్తే ఇలాంటి విపత్తులపై సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు రాబోయే రబీ సీజన్‌లోనూ కరువు ముప్పు పొంచి ఉందని కమిషన్ హెచ్చరించింది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేళ రైతులు గత్యంతరం లేక వరి, పత్తి పంటలపైనే ఆధారపడుతున్నారని, దీనికి కారణం మద్దతు ధరలు శాస్త్రీయంగా లేకపోవడమేనని కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర (MSP) ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాంప్రదాయ పద్ధతుల నుంచి రైతులను ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడి వైపు మళ్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యంత్రీకరణ సాయం, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని రైతు కమిషన్ కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story