Farming: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఇచ్చే బంగారు పంట..!
Farming: తెలుగు రాష్ట్రాల్లో సోయా చిక్కుడు సాగు చేసే రైతులకు సమగ్ర సమాచారం.
Farming: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఇచ్చే బంగారు పంట..!
Soybean Cultivation : వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటల కోసం చూసే రైతులకు 'సోయా చిక్కుడు' (సోయాబీన్) ఒక అద్భుతమైన వరం. చైనాలో పుట్టిన ఈ పంట.. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 0.88 లక్షల హెక్టార్లలో విస్తరించి, ఏటా 1.73 లక్షల టన్నుల భారీ ఉత్పత్తితో దూసుకుపోతోంది. దీనికి కారణం లేకపోలేదు.. సోయా గింజల్లో 43% ప్రోటీన్లు, 20% నూనె ఉంటాయి. అంటే దీనిని పప్పు ధాన్యంగానూ, నూనె గింజల పంటగానూ రెండు రకాలుగా అమ్ముకోవచ్చు. పైగా సోయా నూనె గుండె జబ్బులు ఉన్నవారికి ఎంతో మంచిది కావడంతో మార్కెట్‌లో దీనికి ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.
అనుకూలమైన వాతావరణం, నేలలు
విత్తనం బాగా మొలకెత్తడానికి పగటి ఉష్ణోగ్రత 15°C నుండి 32°C మధ్య ఉండాలి. అయితే 10°C కంటే తక్కువ, 40°C కంటే ఎక్కువ ఉంటే పంట ఎదుగుదల ఆగిపోతుంది. ఏడాదికి 600-650 మి.మీ వర్షపాతం సరిపోతుంది. అధిక వర్షాలు పడితే మాత్రం దిగుబడి తగ్గుతుంది. నేల పి.హెచ్ విలువ 6.5 నుండి 7.5 ఉండాలి. ఇసుకతో కూడిన కర్బన శాతం (నల్లటి సారం) ఎక్కువగా ఉన్న నేలలు ఈ పంటకు బెస్ట్.
నేల తయారీ - విత్తన శుద్ధి
నేలను 1-2 సార్లు లోతుగా దున్ని, ఆపై గుంటక లేదా కల్టివేటర్‌తో సమానంగా చేసుకోవాలి. ఎకరాకు 25-30 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. సోయా చిక్కుడు లేగ్యూం (వేరుశనగ లాంటి) జాతికి చెందినది. కాబట్టి విత్తే ముందు ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం జపానికం కల్చర్‌ను కలిపి నీడలో ఆరబెట్టాలి. దీనివల్ల వేర్ల బుడిపెల ద్వారా మొక్క గాలిలోని నత్రజనిని గ్రహిస్తుంది. ఫలితంగా యూరియా ఎరువుల ఖర్చు బాగా తగ్గుతుంది. దీనికంటే ముందే థైరామ్ లేదా కాప్టాన్, ఇమిడాక్లోప్రిడ్‌లతో ప్రాథమిక విత్తన శుద్ధి చేసుకోవడం మంచిది.
విత్తే సమయం - దూరం
ఖరీఫ్‌లో అయితే జూన్ 15 నుండి జూలై వరకు, రబీలో అక్టోబర్, వేసవిలో ఫిబ్రవరి నెలలో విత్తుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 5 సెం.మీ దూరం ఉండాలి. అదే తేలికపాటి నేలల్లో అయితే 30 సెం.మీ x 7.5 సెం.మీ దూరం పాటించాలి. చివరి దుక్కిలోనే ఎకరాకు 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ వేసుకోవాలి.
కలుపు నిర్మూలన
సోయాలో సకాలంలో కలుపు తీయకపోతే 6% నుండి 27% వరకు దిగుబడి పడిపోతుంది. విత్తిన రోజు నుండి 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికోసం విత్తిన 24-48 గంటల లోపుఎకరాకు 1 లీటరు అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ మందును పిచికారీ చేయాలి. ఖరీఫ్‌లో వర్షాధారంగా వేస్తే నీరు అవసరం లేదు. కానీ రబీ, వేసవి కాలాల్లో పంట మొలకెత్తే దశలో, కాయ ఊరే (అభివృద్ధి) దశలో అస్సలు తడి ఆరనివ్వకూడదు. వేసవిలో కనీసం 5-6 తడులు ఇవ్వాలి.
కోత కోయడం
కాయలు పక్వానికి రాగానే ఆలస్యం చేయకుండా కోయాలి. లేదంటే గింజలు రంగు మారి రాలిపోతాయి. కోసిన మొక్కలను కళ్లంలో 2-3 రోజులు ఎండబెట్టి, కర్రలతో లేదా ట్రాక్టర్లతో నూర్పిడి చేసి గింజలను వేరు చేయాలి.గింజల్లో 11 శాతం తేమ వచ్చే వరకు బాగా ఎండబెట్టి, ఆపై గోదాముల్లో నిల్వ చేయాలి. సోయా చిక్కుడు విత్తనాలకు ఒక సీజన్ వరకు మాత్రమే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చే సీజన్ కోసం విత్తనం దాచుకునేటప్పుడు మధ్య మధ్యలో ఎండలో ఆరబెడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ సోయా చిక్కుడు సాగు చేస్తే రైతులు తక్కువ పెట్టుబడితోనే అత్యధిక లాభాలను సొంతం చేసుకోవచ్చు.




