Sunflower: తక్కువ నీరు.. ఎక్కువ లాభం.. పొద్దుతిరుగుడు ప్రస్థానం..!

మెదక్ జిల్లా నిజాంపేట మండల రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లుతున్నారు.

Naresh.k
Published on: 11 May 2026 1:43 PM IST
Sunflowe
X

Sunflower

Farming: సాంప్రదాయ పంటల సాగుతో పోలిస్తే, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంట మార్పిడి చేపట్టడమే రైతుకు అసలైన లాభదాయకం. ఇదే సూత్రాన్ని పాటిస్తూ మెదక్ జిల్లా నిజాంపేట మండల రైతులు ఆరుతడి పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో పసిడి లాంటి ఆదాయాన్ని ఇచ్చే పొద్దుతిరుగుడు సాగు వైపు ఇక్కడి అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.

ఆర్థిక పురోగతి

వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, అవగాహన సదస్సుల ప్రభావంతో నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 175 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతోంది. మండల కేంద్రమైన నిజాంపేటతో పాటు..తిప్పనగుల్ల, కల్వకుంట,నందిగామ, చల్మెడ ,నస్కల్‌, రాంపూర్‌,వెంకటాపూర్‌(కె), నార్లపూర్‌, నగరం వంటి గ్రామాల్లో రైతులు ఈ పంటను సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. సుమారు 15 రోజులకు ఒకసారి తడిని అందిస్తే సరిపోతుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ఇది వరప్రసాదం లాంటిది.శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే ఒక ఎకరానికి 8 నుండి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు.వరి వంటి పంటలతో పోలిస్తే దీనికి పెట్టుబడి ఖర్చు తక్కువ, ఆదాయం మాత్రం ఆశాజనకంగా ఉంటుంది.

నిపుణుల సూచనలు

పొద్దుతిరుగుడు సాగులో మంచి ఫలితాలు సాధించాలంటే కేవలం సాగు చేయడమే కాదు, సంరక్షణ కూడా ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు. పంటను పశువులు, ముఖ్యంగా పక్షుల బారి నుండి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకు ఏదైనా తెగుళ్లు లేదా వ్యాధులు సోకినప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా, వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. అధికారుల సలహాల మేరకు ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల నాణ్యమైన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

అరకొర నీటి వసతితో ఇబ్బంది పడే రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని నిజాంపేట మండల రైతులు నిరూపిస్తున్నారు. సాగు విధానంలో మార్పులు చేసుకుంటూ, అధికారుల సూచనలు పాటిస్తే వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని చాటిచెబుతున్నారు మన అన్నదాతలు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story