Agriculture: రైతులకు బంపర్ ఆఫర్.. వరి మానేస్తే ఎకరానికి రూ. 10,000 బోనస్!

Agriculture: తెలంగాణలో రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గించాలని కేంద్రం ఆదేశించింది.

Naresh.k
Published on: 28 May 2026 1:59 PM IST
Agriculture
X

Agriculture: రైతులకు బంపర్ ఆఫర్.. వరి మానేస్తే ఎకరానికి రూ. 10,000 బోనస్!

Farmers: తెలంగాణ వ్యవసాయ రంగంలో త్వరలోనే ఒక భారీ విప్లవాత్మక మార్పు రాబోతోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయి దిగుబడులతో దేశానికే అన్నపూర్ణగా మారిన తెలంగాణలో.. ఇకపై వరి సాగును తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న వరి నిల్వలు, పడిపోతున్న భూగర్భ జలాలు, పర్యావరణ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణతో పాటు పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

25 లక్షల ఎకరాల్లో వరి బంద్

సాగునీటి వసతులు పెరగడంతో తెలంగాణలో వరి సాగు గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం సాగు భూమిలో ఒక్క వరి వాటానే 60 శాతానికి చేరింది. తెలంగాణలో ప్రతి ఏటా కనీసం 5 లక్షల ఎకరాల చొప్పున వరి సాగును తగ్గించాలి. రాబోయే ఐదేళ్లలో మొత్తం 25 లక్షల ఎకరాలలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున సాగు మార్చడం అటు రైతులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అగ్నిపరీక్ష లాంటిదేనని చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వం వరి సాగును నియంత్రించడానికి కేవలం నిల్వల సమస్యే కాకుండా, బలమైన పర్యావరణ, ఆర్థిక కారణాలను చూపిస్తోంది.వరి పంటకు విపరీతంగా నీరు అవసరం కావడం వల్ల భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. మోటార్ల వాడకం వల్ల విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతోంది. నీరు నిల్వ ఉండే వరి పొలాల నుండి వెలువడే ‘మిథేన్’ వాయువు వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. దేశంలో వరి నిల్వలు అవసరానికి మించి ఉంటే.. పప్పుధాన్యాలు, నూనెగింజల కొరత వేధిస్తోంది. వీటి కోసం ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. అందుకే వరిని తగ్గించి.. మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న కంది, సోయాబీన్, పెసర, మినుము, జొన్నలు వంటి లాభదాయక పంటల వైపు రైతులను మళ్లించాలని కేంద్రం పట్టుబడుతోంది.

రైతులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్

కేంద్రం నిర్ణయంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక క్రేజీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వరి సాగును పక్కన పెట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు మారే రైతులకు నష్టం రాకుండా.. ఎకరానికి రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు నేరుగా నగదు బదిలీ రూపంలో ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి ఏడాదిలోనే అంతటా కాకుండా, కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తూ.. ఐదేళ్లలో దశలవారీగా ఈ 25 లక్షల ఎకరాల పంట మార్పిడి లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story