Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న అకౌంట్లలోకి ‘రైతు భరోసా’ డబ్బులు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్! ఈ నెల 26న ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌కు సంబంధించిన 'రైతు భరోసా' నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న అకౌంట్లలోకి ‘రైతు భరోసా’ డబ్బులు
Rythu Bharosa: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా (Rythu Bharosa) నిధుల విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన నిధులను ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేయనున్నారు. మధిరలో జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసి, ప్రసంగించనున్నారు.
ఈ వానాకాలం సాగు పెట్టుబడి సాయం కోసం రూ.9,000 కోట్ల నిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా రాష్ట్రంలోని దాదాపు 73 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నాటి 'రైతు బంధు' పథకాన్ని సవరించి, కాంగ్రెస్ సర్కార్ ఈ 'రైతు భరోసా'ను ప్రవేశపెట్టింది. నిబంధనల ప్రకారం ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.7,500 చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు మాత్రం ఎకరాకు రూ.6,000 చొప్పున విడుదల చేస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లు, గుట్టలు, కొండల వంటి వ్యవసాయేతర భూములకు కూడా నిధులు కేటాయించడం వల్ల భారీగా ప్రజాధనం వృథా అయిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక మార్పులు చేస్తోంది.
మైనింగ్, పారిశ్రామిక ప్రాంతాలు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే సాగుకు యోగ్యం కాని భూములను మినహాయించేందుకు క్షేత్రస్థాయి ధ్రువీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ వడపోత ప్రక్రియలో భాగంగా సుమారు 15 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యం కాదని అధికారులు అంచనా వేసి పక్కన పెడుతున్నారు. ఓన్లీ నిఖార్సైన సాగు భూములకే నిధులు అందేలా చూస్తున్నారు.
అర్హత నిబంధనలు & ప్రత్యేక ప్రయోజనాలు:
కౌలు/భూమి లేని కూలీలకు ఆసరా: భూమి లేని వ్యవసాయ కూలీలు తాము భూమి లేని వారమని అధికారుల వద్ద నిరూపించుకుంటే, వారికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నారు.
వరి సాగుకు బోనస్: ఈ పథకం కింద ప్రత్యేకంగా వరి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.500 బోనస్ లభిస్తుంది. అయితే దీని కోసం రైతులు తమ పంట అమ్మకాల వివరాలను సాక్ష్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవల కొత్తగా డిజిటల్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ విడతలోనే నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో నిధుల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశ: ఎకరం లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రైతు భరోసా నిధులను ముందుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. రెండో దశ: ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు వరుస క్రమంలో నిధులు అందజేస్తారు.
గత యాసంగి (రబీ) సీజన్‌లో కేవలం రెండు ఎకరాల వరకే సాయం పరిమితం చేయడంపై విమర్శలు రావడంతో.. ఈసారి ప్రతి ఎకరానికి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పెట్టుబడి ఖర్చుల కోసం అప్పుల భారం పడకుండా సకాలంలో సాగు పనులు ప్రారంభించుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




