Farmer Success Story: ఒక్క ఐడియా ఈ రైతు జీవితాన్ని మార్చేసింది.. 2 నెలల్లో రూ.2.5 లక్షల సంపాదన
Farmer Success Story: సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి.. కేవలం 2 నెలల్లో రూ.2.5 లక్షలు సంపాదించిన యువ రైతు.
Farmer Success Story: ఒక్క ఐడియా ఈ రైతు జీవితాన్ని మార్చేసింది.. 2 నెలల్లో రూ.2.5 లక్షల సంపాదన
Watermelon Farming: వ్యవసాయం అంటేనే పెట్టుబడులు, నిత్యం నష్టాలు, అప్పుల ఊబి.. సాధారణంగా వ్యవసాయం గురించి మనం ఎప్పుడూ వినే మాటలివి. ఈ నష్టాలు భరించలేక చాలా మంది రైతులు సాగును వదిలేసి పట్టణాలకు వలస వెళ్తున్నారు. కానీ, కొందరు యువ రైతులు మాత్రం సంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి, ఆధునిక ఆలోచనలతో, సీజన్‌కు తగ్గట్టు పంటలు వేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. సరిగ్గా ఇదే బాటలో పయనించి, కేవలం రెండు నెలల కాలంలోనే రూ. 2.5 లక్షల వరకు లాభం ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు ఒక యువ రైతు.
జీవితంలో సరైన సమయంలో సరైన మార్గదర్శి దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు ఈ ప్రగతిశీల రైతు. రాయ్‌బరేలీ జిల్లా శివగఢ్ పరిధిలోని పద్రా ఖుర్ద్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే యువ రైతు తనకున్న ఎకరం పొలంలో ఎప్పటిలాగే తాతల కాలం నాటి సంప్రదాయ పంటలు వేసేవాడు. పెట్టుబడి ఎక్కువ, లాభాలు తక్కువగా ఉండేవి. ఈ క్రమంలో విజయ్ బంధువు, హార్టికల్చర్ రంగంపై అవగాహన ఉన్న పవన్ వర్మ ఒక శుభకార్యానికి వచ్చినప్పుడు విజయ్‌కి ఒక క్రేజీ ఐడియా ఇచ్చాడు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పుచ్చకాయ సాగు చేయమని సూచించాడు. బంధువు సలహా విజయ్ నచ్చడంతో వెంటనే రంగంలోకి దిగాడు.
విజయ్ కుమార్ తనకున్న ఒక ఎకరం పొలంలో ఆధునిక పద్ధతుల్లో పుచ్చకాయ సాగును ప్రారంభించాడు. ఈ పంట ప్రత్యేకత ఏంటంటే.. కేవలం 60 నుంచి 70 రోజుల్లోనే (రెండు నెలలు) చేతికి వచ్చేస్తుంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు అంతా కలిపి కేవలం రూ.50,000 నుంచి రూ.60,000 మాత్రమే అయ్యింది. వేసవి కాలంలో పుచ్చకాయలకు మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. దాంతో విజయ్ పండించిన పంటకు లక్నో, రాయ్‌బరేలీ హోల్‌సేల్ మార్కెట్లలో భారీ ధర పలికింది. అన్ని ఖర్చులు పోను కేవలం రెండు నెలల వ్యవధిలోనే విజయ్‌కు రూ.2,00,000 నుండి రూ.2,50,000 వరకు నికర లాభం దక్కింది.
సంప్రదాయ పంటలతో పోలిస్తే పుచ్చకాయ సాగులో రిస్క్ తక్కువ, లాభాలు చాలా ఎక్కువ. కేవలం రెండు నెలలు కష్టపడితే చాలు, పెట్టుబడికి నాలుగు రెట్లు ఆదాయం వస్తుంది అని విజయ్ కుమార్ ఎంతో ఆనందంగా చెబుతున్నాడు. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల రైతులు సైతం విజయ్ సాధించిన విజయాన్ని చూసి పుచ్చకాయ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి, వినియోగదారుల అవసరాలను గుర్తించి స్మార్ట్‌గా వ్యవసాయం చేస్తే.. సాగు నష్టాల సామెతను తిరగరాయవచ్చని ఈ యువ రైతు నిరూపించాడు.




