Makhana: నీటిలో పండే తెల్ల బంగారం.. ఎకరాకు లక్షల్లో లాభం..!
Makhana: తక్కువ శ్రమతో, భారీ లాభాలను తెచ్చిపెట్టే మఖానా సాగుకు ఎకరాకు రూ. 60 వేల పెట్టుబడితో రూ. 1.5 లక్షల నికర లాభం పొందే మార్గాలు ఇవే.
Makhana
Farming: ప్రస్తుతం వ్యవసాయ రంగంలో తక్కువ శ్రమతో, భారీ లాభాలను తెచ్చిపెట్టే సూపర్ ఫుడ్ పంటగా మఖానా దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు కేవలం బీహార్‌కే పరిమితమైన మఖానా సాగు, నేడు తన పోషక విలువల వల్ల ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. చెరువులు, కుంటలు లేదా నీరు నిలిచే పొలాల్లో ఈ పంటను సాగు చేస్తూ రైతులు అద్భుతమైన ఆదాయాన్ని గడిస్తున్నారు.
ఏ సీజన్‌లో వేస్తే లాభదాయకం?
మఖానా సాగుకు డిసెంబర్ - జనవరి మాసాలు అత్యంత అనుకూలమైన సమయం.డిసెంబర్ నెలలో నారు పోసుకోవాలి. ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో ప్రధాన పొలంలో నాట్లు వేయాలి. జూలై నుంచి సెప్టెంబర్ లోపు పంట చేతికి వస్తుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ తామర ఆకులు, గింజలు వేగంగా వృద్ధి చెందుతాయి.
ఎకరాకు అయ్యే ఖర్చు
మఖానా సాగులో ఇతర పంటల కంటే కూలీల ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే గింజలను నీటి అడుగు నుంచి సేకరించాల్సి ఉంటుంది. నారు ,నాట్లుకు రూ. 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. అలాగే ఎరువులు , పురుగుల మందులకు మరో రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు ఖర్చులు అవొచ్చు. ఇక కూలీల ఖర్చు, ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ. 35,000 వరకు అవుతుంది. అంటే మొత్తం పెట్టుబడి ఎకరాకు సుమారు రూ. 45,000 నుంచి రూ. 60,000 వరకు అవుతుంది.
దిగుబడి
సాధారణంగా ఒక ఎకరా సాగులో 10 నుంచి 15 క్వింటాళ్ల ముడి మఖానా గింజల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో నాణ్యతను బట్టి ముడి గింజల ధర క్వింటాల్‌కు రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు పలుకుతోంది. తక్కువ సమయంలో అంటే 6 నుంచి 7 నెలల్లో ఎకరాకు రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు నికర లాభం సంపాదించే అవకాశం మఖానా సాగులో ఉంది.
ఫుల్ డిమాండ్
నీటి నిల్వ ఉన్న భూములకు వరం: వరి పండని చిత్తడి భూముల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. మఖానాతో పాటు అదే నీటిలో చేపల సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. డైట్ చేసే వారు, జిమ్ వెళ్లే వారు స్నాక్స్‌గా మఖానానే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి మార్కెటింగ్ సమస్య ఉండదు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, మఖానా సాగు రైతులకు నిజంగానే బంగారు బాతు లాంటిది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఆశించే యువ రైతులకు ఇదొక గొప్ప వ్యాపార అవకాశం.




