Ghatkesar: 13 ఏళ్లుగా పూర్తికాని వంతెన.. ఘట్‌కేసర్‌లో ఆమరణ దీక్షకు పిలుపు!

Ghatkesar: ఘట్‌కేసర్ రైల్వే వంతెన నిర్మాణం 13 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండటాన్ని నిరసిస్తూ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు.

KARUNAKAR, UPPAL
Published on: 1 May 2026 7:37 AM IST
Ghatkesar
X

Ghatkesar: 13 ఏళ్లుగా పూర్తికాని వంతెన.. ఘట్‌కేసర్‌లో ఆమరణ దీక్షకు పిలుపు!

ఘట్‌ కేసర్: పదమూడు సంవత్సరాలుగా నత్త నడకన సాగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్‌ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. మే 11వ తేదీ నుంచి ప్రజల సహకారంతో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2012లో నోటిఫికేషన్ విడుదలై, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి, ఈ రైల్వే వంతెన పనులు 2014లో ప్రారంభమైనప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల వైఖరి, పాలకుల నిర్లిప్తత కారణంగా ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఘట్‌ కేసర్‌లోని వివేకానంద చౌరస్తా వద్ద ఆమరణ నిరాహారదీక్షకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అబ్బసాని మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా ఘట్ కేసర్, గ్రామ పంచాయతీ స్థాయి నుండి మున్సిపల్ సర్కిల్ వరకు మార్పు చెందింది. కానీ ఘట్ కేసర్ రైల్వే వంతన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. రైల్వే వంతెన పనులు పూర్తి కాకపోవడంతో 2022లో ఇదే సమస్యపై చేపట్టిన రిలే నిరాహారదీక్ష సమయంలో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇచ్చిన హామీ అమలు కాలేదని విమర్శించారు.

2023లో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన భారీ సమావేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌ ను తొలగించి, రీటెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌ కు పనులు అప్పగించినప్పటికీ, కొంతవరకే పనులు పూర్తై మిగతా భాగం పనులు పెండింగ్‌ లోనే ఉందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వానంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండున్నర సంవత్సరాలు గడిచినా భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించకుండా, వంతెన పనులు పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు. జాయింట్ యాక్షన్ కమిటీ, స్థానిక యువత, విద్యార్థులు, మహిళలు పలు మార్లు ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు, పాలకులు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదని విమర్శించారు.

రైల్వే గేట్ దాటే సమయంలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ట్రాక్ దాటే క్రమంలో జరిగిన ఓ మహిళ మరణంపై మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. రైల్వే వంతెన పూర్తయ్యే వరకు తన పోరాటం ఆగదని, ప్రజల మద్దతుతో ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తానని యాదగిరి యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఆంజనేయులు పంతులు, మాజీ కౌన్సిలర్ బేతాళ నర్సింగ్ రావు, నాగభూషణం, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్, కొత్తకొండ వెంకటేష్, దంతాల అనిల్, దంతూరి గోపాల్ గౌడ్, కుసపటి పద్మారావు, సుబ్బారావు, అంబాజి, శ్రీరాములు, తన్నీరుల రాంబాబు, రాజబోయిన రామచందర్, రామకృష్ణ, సారా శ్రీనివాస్ గౌడ్, బండి శివ, వెంకటాచారి, కె. శ్రీనివాస్, గురుదేవ్, జంగయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story