Hyderabad: ఆమనగల్లులో గంజాయి కలకలం: 35 కిలోలు పట్టివేత!
Hyderabad: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో 35 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు. రూ. 17.60 లక్షల విలువైన గంజాయితో పాటు ఇద్దరి అరెస్ట్, వెల్లడించిన డీసీపీ.
Hyderabad: ఆమనగల్లులో గంజాయి కలకలం: 35 కిలోలు పట్టివేత!
Hyderabad: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆమనగల్లు మార్కెట్ యార్డు వద్ద 35 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 ప్యాకెట్లలో ఉన్న గంజాయితో పాటు ఒక వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి తదితర ఆస్తుల విలువ సుమారు రూ.17.60 లక్షలు ఉంటుందని మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
ఆమనగల్లు పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి, ఆమనగల్లు ఎస్‌హెచ్ఓ వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 6న ఆమనగల్లు పోలీసులు, ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధికి చెందిన కుంజం చందు బాబు దొర (26), కొసు వెంకట సాయి బాబు దొర (23)గా నిందితులను గుర్తించారు. రంపచోడవరం ప్రాంతానికి చెందిన ‘అభి’ అనే వ్యక్తి గంజాయి సరఫరా కోసం వీరితో ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తానని చెప్పినట్లు విచారణలో వెల్లడైందన్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ మీదుగా ఆమనగల్లుకు చేరుకున్న నిందితులు మార్కెట్ యార్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తికి గంజాయి అప్పగించేందుకు వేచి ఉండగా పోలీసులకు చిక్కారు. వారి వద్ద ఉన్న 17 ప్యాకెట్లలో సుమారు 35 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ‘అభి’ కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఆమనగల్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఓటీ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




