Kushaiguda: కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ప్రతిష్టకు ముహూర్తం ఖరారు
Kushaiguda: హైదరాబాద్ కుషాయిగూడలో 54 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది.
Kushaiguda: కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ప్రతిష్టకు ముహూర్తం ఖరారు
Kushaiguda: హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో, కుషాయిగూడ బజరంగ్ దళ్, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో నిర్మిస్తున్న 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మే 1, శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి, స్వాతి నక్షత్ర సమూహూర్తంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారీ హనుమాన్ విగ్రహంతో పాటు మూలవిరాట్ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి, వినాయక విగ్రహాల యంత్ర మంత్ర ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నారు. 28 మంగళవారం సాయంత్రం దేవత మూర్తుల గ్రామోత్సవం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. 29వ తేదీన ఉదయం, సాయంత్రం హోమాలు, దేవతామూర్తుల జలాధివాసం, 30వ తేదీ గురువారం ఉదయం,
సాయంత్రం హోమాలు, ధాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమాలను శ్రీ హంపి వీరుపాక్ష విద్యారణ్య భారతి స్వామి, శ్రీ యోగానంద సరస్వతి స్వామి (అదిలాబాద్), శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి, శ్రీ చిట్టి పెద్ది రామశర్మ గారి ఆధ్వర్యంలో వైదిక బ్రాహ్మణులు యంత్ర మంత్ర ప్రాణ ప్రతిష్టగా నిర్వహించనున్నారు. విగ్రహ విశేషాలు ఆకట్టుకుంటున్నాయి. 54 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ విగ్రహ కిరీటాన్ని రాజస్థాన్ జైపూర్ నుంచి తెప్పించిన జర్కాన్ రత్నంతో అలంకరించారు.
స్వామివారి సహజ నేత్రాలను (మనిషి కళ్లలా కనిపించే విధంగా) తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. హృదయ భాగంలో అయోధ్య బాల రాముని దివ్యమంగళ స్వరూపాన్ని ప్రతిష్టించారు. ఆలయ గర్భగుడిలో మూలవిరాట్ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామితో పాటు నవహనుమాన్ మూర్తులను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ముఖద్వారం ఇరువైపులా ఒకవైపు శివపార్వతులు,
మరోవైపు లక్ష్మీనారాయణ మూర్తులను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాల్లో హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి, కుషాయిగూడ బజరంగ్ దళ్, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మాణ పనులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ప్రతిష్ట పూజ కార్యక్రమాలను విజయవంతం చేయాలని భక్తులను కోరారు.




