Abdullapurmet: పిగిలిపూర్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారంపై విచారణ

Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగిలిపూర్ సర్వే నంబర్ 17 లోని ప్రభుత్వ, భూదాన్ భూముల వర్గీకరణపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 16 Nov 2026 5:20 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: పిగిలిపూర్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారంపై విచారణ

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగిలిపూర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. పిగిలిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 17లో మొత్తం 386 ఎకరాల 15 గుంటల భూమికి సంబంధించి భూ రికార్డులు, వర్గీకరణపై పలు సందేహాలు ఉన్నాయని సర్పంచ్ తెలిపారు. 1954-55 గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమిని వివిధ కేటగిరీలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

వాటిలో సర్వే నంబర్ 17/1/2/0లో 75 ఎకరాలు, 17/2లో 61 ఎకరాలు, 17/3 నుంచి 17/18 వరకు 53 ఎకరాలు, మిగిలిన పట్టా భూమిగా 197 ఎకరాల 15 గుంటలు ఉన్నట్లు వినతిపత్రంలో వివరించారు. ఈ భూములకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని నిర్ధారించాలని కోరారు.

అదేవిధంగా, తహసీల్దార్ కార్యాలయం నుంచి 17-02-2025న జారీ చేసిన ప్రొసీడింగ్స్ నంబర్ B/143/2024లో సర్వే నంబర్ 17లోని భూములను సీలింగ్ భూములు, భూదాన్ భూములు, ప్రభుత్వ భూములుగా గుర్తించినట్లు సర్పంచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, ఆయా ప్రభుత్వ భూముల సరిహద్దులను క్షేత్రస్థాయిలో స్పష్టంగా గుర్తించి, హద్దులు నిర్ణయించి, భూముల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ ఆక్రమణలకు అవకాశం లేకుండా చూడాలని కోరారు.

ప్రభుత్వ భూముల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, భూదాన్ భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR