Hyderabad: ‘ఆదివాసీల ఆత్మఘోష ధర్నా’.. హక్కుల పరిరక్షణకు డిమాండ్!
Hyderabad: హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 'ఆదివాసీల ఆత్మఘోష ధర్నా' నిర్వహించారు.
Hyderabad: ‘ఆదివాసీల ఆత్మఘోష ధర్నా’.. హక్కుల పరిరక్షణకు డిమాండ్!
Hyderabad: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల రక్షణ, ఉద్యోగ అవకాశాల కల్పన తదితర డిమాండ్లతో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బుధవారం ‘ఆదివాసీల ఆత్మఘోష ధర్నా’ నిర్వహించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గెడం గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య తదితరులు పాల్గొని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
1976లో లంబాడీలను గిరిజన జాబితాలో చేర్చిన విధానంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో LTR 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతోపాటు భూముల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. PESA చట్టం నిబంధనలకు అనుగుణంగా సర్పంచ్ పదవులను గిరిజనులకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
G.O.Ms.No.3 తరహాలో ప్రత్యేక స్థానిక నియామక చట్టాన్ని తీసుకువచ్చి గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పోలీస్ నియామకాల్లో ఆదివాసీ నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు. ఆదివాసీ యువతి ఊకే శిరీష హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




