Uppal: కల్తీ మసాలా మాఫియా గుట్టురట్టు.. రూ.1.50 కోట్ల సరుకు సీజ్!

Uppal: రామంతాపూర్, మేడిపల్లిలో కల్తీ మసాలాల కేంద్రాలపై మల్కాజిగిరి పోలీసుల దాడులు. రూ.1.50 కోట్ల విలువైన 10.89 టన్నుల సరుకు సీజ్, ముగ్గురి అరెస్ట్.

KARUNAKAR, UPPAL
Published on: 21 Aug 2026 11:46 AM IST
Uppal
X

Uppal: కల్తీ మసాలా మాఫియా గుట్టురట్టు.. రూ.1.50 కోట్ల సరుకు సీజ్!

Uppal: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ మసాలాల తయారీ, ప్రాసెసింగ్‌, గ్రైండింగ్‌, ప్యాకింగ్‌ పేరుతో సాగుతున్న భారీ కల్తీ దందాను మల్కాజిగిరి పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా వెలుగులోకి తీసుకువచ్చారు. రామంతాపూర్‌, మేడిపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన మసాలాలను రీసైక్లింగ్‌ చేసి కొత్త తేదీలతో మార్కెట్‌లోకి పంపుతున్న వ్యవహారంతో పాటు.. కారం, పసుపు, ధనియాల పొడి తదితరాల్లో నాణ్యత లేని పదార్థాలను కలుపుతున్నట్లు గుర్తించారు. రెండు యూనిట్లలో కలిపి రూ.1.50 కోట్లకు పైగా విలువైన మసాలాలు, ముడిసరుకు, యంత్రాలు, ప్యాకింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఉప్పల్‌లోని డీసీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి దాడుల వివరాలను వెల్లడించారు. ఎస్‌ఓటీ ఉప్పల్‌, ఎస్‌ఓటీ కంటోన్మెంట్‌, ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ సర్వైలెన్స్‌ బృందాలు, నిఘా విభాగాల సమన్వయంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

రామంతాపూర్‌లో గడువు ముగిసిన మసాలాల రీసైక్లింగ్‌

రామంతాపూర్‌ లక్ష్మీనారాయణనగర్‌లోని వి.మెహక్‌ మసాలాస్‌ యూనిట్‌పై ఉప్పల్‌ ఎస్‌ఓటీ, కంటోన్మెంట్‌ ఎస్‌ఓటీ, ఫుడ్‌ సేఫ్టీ సర్వైలెన్స్‌ బృందాలు, నిఘా విభాగాల సమన్వయంతో దాడులు నిర్వహించారు. సుమారు మూడేళ్లుగా ఈ యూనిట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌కు అవసరమైన ఫుడ్‌ సేఫ్టీ అనుమతులు లేకుండా కేవలం మున్సిపల్‌ ట్రేడ్‌ లైసెన్స్‌తోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

యూనిట్‌లో సుమారు 17 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన మసాలా ప్యాకెట్లను తెరిచి, అందులోని పదార్థాలను తిరిగి ప్రాసెస్‌ చేసి కొత్త ప్యాకెట్లలో నింపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వాటిపై కొత్త తయారీ తేదీలు, ఇతర వివరాలను ముద్రించి తాజా ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి పంపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నాణ్యత లేని మిరపకాయలు, మిరప తొడిమలు, సా డస్ట్‌ వంటి పదార్థాలను కలిపి కారం పొడి తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

కొన్ని ఉత్పత్తుల్లో ఆహార రంగులు ఉపయోగించి ఆకర్షణీయమైన రంగు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యూనిట్‌లో సుమారు 330 కిలోల గడువు ముగిసిన మసాలాలు, 2,228 కిలోల ఇతర ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రకాల యంత్రాలు, ప్యాకింగ్‌ సామగ్రిని కూడా సీజ్‌ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సరుకు, పరికరాల విలువ సుమారు రూ.1.25 కోట్లు ఉంటుందని సీపీ తెలిపారు.

ప్రముఖ బ్రాండ్లను పోలిన ప్యాకేజింగ్‌, మార్కులు, లేబుళ్లను ఉపయోగించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ప్యాకెట్లపై ఐఎస్‌ఐ, అగ్‌మార్క్‌ తదితర గుర్తులను పోలిన వివరాలు ముద్రించినట్లు తెలిపారు. స్వస్తిక్‌ బ్రాండ్‌ను పోలిన ప్యాకేజింగ్‌ను కూడా తయారు చేసి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో యూనిట్‌కు సంబంధించిన దేవనేని భూపేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. యూనిట్‌ లైసెన్స్‌ కవిత నరేష్‌ పేరుతో ఉన్నట్లు పేర్కొన్నారు.

మేడిపల్లిలో మరో కల్తీ కేంద్రంపై దాడి

మేడిపల్లి శ్రీనివాస్‌నగర్‌ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై ఎస్‌ఓటీ మల్కాజిగిరి పోలీసులు దాడి చేశారు. మసాలాల తయారీ, ప్రాసెసింగ్‌, గ్రైండింగ్‌, ప్యాకింగ్‌ జరుగుతున్న ఈ కేంద్రంలో అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కారం పొడిలో చెక్కపొడి వంటి పదార్థాలను కలుపుతున్నట్లు గుర్తించారు.

కొన్ని నమూనాల్లో కారం పొడిలో సుమారు 30 శాతం వరకు చెక్కపొడి కల్తీ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే స్వాధీనం చేసుకున్న పదార్థాల నమూనాలను ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీకి పంపించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ యూనిట్‌లో కూడా ప్రముఖ బ్రాండ్‌ను పోలిన ప్యాకేజింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్‌ నంబర్‌, పోషక విలువలు తదితర వివరాలను ముద్రించి ఉత్పత్తులను మార్కెట్‌కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

10.89 టన్నుల మసాలా పదార్థాలు స్వాధీనం

మేడిపల్లి యూనిట్‌లో భారీగా మసాలా పదార్థాలు పట్టుబడ్డాయి. సుమారు 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10,890 కిలోలు అంటే 10.89 టన్నుల ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో సత్యనారాయణ, రుద్రశేఖర్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మసాలాల తయారీకి జాబ్‌వర్క్‌ ఇస్తున్న వ్యవహారంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ల్యాబ్‌ నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్లు

స్వాధీనం చేసుకున్న మసాలా పదార్థాల నమూనాలను ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. ల్యాబ్‌ నివేదికల్లో కల్తీ, నిషేధిత లేదా హానికర పదార్థాల వినియోగం నిర్ధారణ అయితే సంబంధిత చట్టాల కింద మరిన్ని కఠినమైన సెక్షన్లు నమోదు చేస్తామని సీపీ సుమతి తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా కల్తీకి పాల్పడినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్యాకెట్‌ చూసి మోసపోవద్దు

మసాలా ప్యాకెట్లను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. బ్రాండ్‌ పేరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్‌ నంబర్‌, ప్యాకేజింగ్‌, లేబులింగ్‌ వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని కోరారు. ప్రముఖ బ్రాండ్లను పోలిన ప్యాకేజింగ్‌ చూసి మోసపోవద్దని హెచ్చరించారు. అనుమానాస్పదంగా కనిపించే మసాలా ఉత్పత్తులు, అనుమతులు లేకుండా నడుస్తున్న తయారీ కేంద్రాల సమాచారం ఉంటే 8712662111 ఫుడ్‌ సేఫ్టీ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

అధికారులకు సీపీ అభినందనలు

కల్తీ మసాలాల తయారీ కేంద్రాలను గుర్తించి భారీగా సరుకును స్వాధీనం చేసుకున్న ఎస్‌ఓటీ బృందాలు, ఉప్పల్‌, మేడిపల్లి పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ సర్వైలెన్స్‌ సిబ్బందిని సీపీ బి.సుమతి అభినందించారు. రామంతాపూర్‌, మేడిపల్లిలోని రెండు కేంద్రాలను స్వయంగా పరిశీలించిన అనంతరం ఉప్పల్‌ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి దాడుల వివరాలను వెల్లడించారు. దాడుల్లో అరెస్ట్‌ చేసిన దేవనేని భూపేష్‌, సత్యనారాయణ, రుద్రశేఖర్‌లను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో వారిని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story