Tarnaka: ఉస్మానియా వేదికగా ఐసా తెలంగాణ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణం!
Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఐసా (AISA) తెలంగాణ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణం చేపట్టారు.
Tarnaka: ఉస్మానియా వేదికగా ఐసా తెలంగాణ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణం!
Tarnaka: విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణ, క్యాంపస్లలో ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మిస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ నాయకులు వెల్లడించారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఐసా తెలంగాణ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి వర్క్షాప్ను ఏర్పాటు చేసి విద్యార్థి ఉద్యమాల భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా ఐసా జాతీయ ఉపాధ్యక్షులు వేమన్న మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ఐక్యం చేస్తూ విద్యార్థుల హక్కుల కోసం ఐసా నిరంతరం పోరాడుతోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), క్యాంపస్లలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకిస్తూ ఐసా ముందుండి ఉద్యమిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నెలకొన్న విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన, విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను విస్తరిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యార్థులకు ఐసా అండగా నిలుస్తుందని, విద్యార్థుల సమస్యలపై ఐక్య పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని నాయకులు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ప్రారంభమైన ఈ పునర్నిర్మాణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు నూతన ఉత్తేజాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ జమ్మి అశోక్, గర్ల్స్ కన్వీనర్ సుజాత, రాష్ట్ర నాయకులు సాయి, చరణ్, సతీష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.




