Nacharam: నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మికుల ధర్నా!
Nacharam: నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు 4 నెలల జీతాలు చెల్లించాలని ధర్నా. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్.
Nacharam: నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మికుల ధర్నా!
Nacharam: నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ డిమాండ్ చేశారు. జీతాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఉదయం కార్మికులు రెండు గంటలపాటు విధులు నిలిపివేసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎం. నరసింహ మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించాలని గత నెల రోజులుగా ఆసుపత్రి అధికారులకు రెండుసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఒకవైపు కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు తెలంగాణలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా సమయానికీ కార్మికులకు జీతాలు అందకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికుల సమస్యలపై కాంట్రాక్టర్లు, అధికారులు స్పందించకపోవడం అన్యాయమని విమర్శించారు.
రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కార్మికులు సమ్మెకు దిగకుండా నిరసనకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
సంబంధిత కాంట్రాక్టర్ను సంప్రదించగా, గత పది నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కావడం లేదని, అయినప్పటికీ ఆరు నెలల జీతాలు చెల్లించామని తెలిపినట్లు నరసింహ వివరించారు. కార్మికులకు సంబంధించిన బిల్లులు పది నెలలుగా పెండింగ్లో ఉండటంతో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో కాంట్రాక్టు కార్మికులు క్రాంతి, భాస్కరాచారి, నిరంకారి, తులసి తదితరులు పాల్గొన్నారు.




