Alwal: 18 గంటల్లో చైన్ స్నాచర్ అరెస్ట్.. రూ.10 లక్షల విలువైన బంగారు గొలుసు స్వాధీనం

Alwal: అల్వాల్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. పంచశీలా ఎంక్లేవ్‌లో వృద్ధురాలిపై చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 18 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

PURENDAR, ALWAL
Published on: 23 April 2026 6:26 AM IST
Alwal
X

Alwal: 18 గంటల్లో చైన్ స్నాచర్ అరెస్ట్.. రూ.10 లక్షల విలువైన బంగారు గొలుసు స్వాధీనం

మేడ్చల్ జిల్లా: (అల్వాల్)పంచశీలా ఎంక్లేవ్‌లో వృద్ధురాలిపై చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని అల్వాల్ పోలీసులు 18 గంటల్లోనే పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఏప్రిల్ 21న సాయంత్రం 7.15 గంటల సమయంలో పంచశీలా ఎంక్లేవ్ రోడ్ నెం.13 వద్ద ఈ ఘటన జరిగింది. మార్కెట్‌ నుంచి ఇంటికి వెళ్తున్న పెద్దిరాజు జానకీదేవి (70)ను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు, ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని సుమారు 6 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాగి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆమెకు మెడ వద్ద గాయాలయ్యాయి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం మచ్చబొల్లారం ఐస్ ఫ్యాక్టరీ వద్ద వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

నిందితుడు మనోజ్ @ మనోజ్ పటేల్ @ మనోజ్ కుమావత్ (24)గా గుర్తించారు. ఇతను మచ్చబొల్లారం ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story