Alwal: చోరీ కేసులో ముగ్గురు యువకులు రిమాండ్‌కు.. వృద్ధురాలి గొలుసు రికవరీ

Alwal: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

PURENDAR, ALWAL
Published on: 6 Jun 2026 9:36 PM IST
Alwal
X

Alwal: చోరీ కేసులో ముగ్గురు యువకులు రిమాండ్‌కు.. వృద్ధురాలి గొలుసు రికవరీ

అల్వాల్: పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు, డెల్ ల్యాప్‌టాప్, ఆపిల్ వాచ్‌తో పాటు 2.58 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, తుర్కపల్లి ప్రాంతంలో మే 29 నుంచి జూన్ 1 మధ్య జరిగిన ఇంటి చోరీ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 31 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డెల్ ల్యాప్‌టాప్, ఆపిల్ వాచ్, నగదును అపహరించారు. బాధితుడు పేరక రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జూన్ 6న రెడ్డి ఎన్‌క్లేవ్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులు మహ్మద్ సలీం (19), భాను ప్రకాష్ (19), మిద్దెపాక భరత్ కుమార్ (19)గా పోలీసులు గుర్తించారు.

వారి వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, వెండి నాణెం, వెండి పట్టీలు, డెల్ ల్యాప్‌టాప్, ఆపిల్ వాచ్, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు 2.58 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసు ఛేదనలో డీసీపీ శ్రీధర్ ఐపీఎస్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, అల్వాల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె.వీరబాబు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు, హెడ్ కానిస్టేబుళ్లు జీవన్ కుమార్, సతీష్, కానిస్టేబుళ్లు రామకాంత్, ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు.

18 గంటల్లోనే చైన్ స్నాచర్ అరెస్ట్

మరోవైపు పంచశీల ఎన్‌క్లేవ్‌లో వృద్ధ మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన నిందితుడిని అల్వాల్ పోలీసులు ఘటన జరిగిన 18 గంటల్లోనే అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ 21న మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న 70 ఏళ్ల పెద్దిరాజు జానకీ దేవి మెడలోని సుమారు 67 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి లాక్కెళ్లాడు. దీంతో ఆమె మెడకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మరుసటి రోజు మాచబొల్లారం ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న మనోజ్ అలియాస్ మనోజ్ పటేల్ (24)ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడి వద్ద నుంచి 67 గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు సాయంత్రం వేళల్లో ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అల్వాల్ పోలీసులు సూచించారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story