Hyderabad: కక్కుర్తి పడి జైలుకెళ్లిన అపార్ట్‌మెంట్ వాచ్‌మన్
Hyderabad: హైదరాబాద్ అల్వాల్‌లో జరిగిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.
Hyderabad: కక్కుర్తి పడి జైలుకెళ్లిన అపార్ట్‌మెంట్ వాచ్‌మన్
Hyderabad: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గృహ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.20.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, మేదిశెట్టి శ్యామ్‌రావు దంపతులు జూన్ 3న తమ ఇంటికి తాళం వేసి మెదక్‌కు వెళ్లగా, జూన్ 27న తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు, అల్మారా పగులగొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కొల్లి లోవరాజు (38) ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడినట్లు తేలింది. అనంతరం దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను పాపనీ రాజు (45), మైలారం మహేష్ చారి (46)లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, బేగంపేట ఏసీపీ పి. గోపాల కృష్ణమూర్తి, అల్వాల్ ఎస్‌హెచ్‌వో ఎ. ప్రశాంత్ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె. వీరబాబు, ఎస్‌ఐలు కె. చంద్రశేఖర్, ఎ. మల్లేష్, క్రైమ్ సిబ్బంది ఛేదించారు.
ఈ సందర్భంగా ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, గృహ సేవకులు, వాచ్‌మెన్ల వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.




