Mahindra University: విద్యార్థులు మార్పులకు అనుగుణంగా మారాలి ఆనంద్ మహీంద్రా
Mahindra University: మహీంద్రా యూనివర్సిటీ 5వ కాన్వొకేషన్‌లో 1309 మందికి పట్టాలు అందజేసిన ఆనంద్ మహీంద్రా. బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.
Mahindra University: విద్యార్థులు మార్పులకు అనుగుణంగా మారాలి ఆనంద్ మహీంద్రా
Mahindra University: భవిష్యత్తులో ఎదురయ్యే ఊహించని మార్పులకు అనుగుణంగా విద్యార్థులు రూపాంతరం చెందాలని మహీంద్రా యూనివర్సిటీ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. మహీంద్రా యూనివర్సిటీ ఐదో వార్షిక కాన్వొకేషన్ వేడుకలు హైదరాబాదులో ఉన్న బహదూర్‌పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు 'జీవితంలో ఒకేసారి' జరుగుతాయనుకునే సంఘటనలు ప్రతి సంవత్సరం చోటుచేసుకునే ప్రపంచంలో ఉన్నాం.
ఇలాంటి ప్రపంచంలో ముందుకు సాగడానికి రెండు 'సూపర్ పవర్స్' అవసరం. అవి.. ఒకటి ఊహించని మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందే సామర్థ్యం, రెండోది అంతర్గత మానసిక బలం. మహీంద్రా యూనివర్సిటీలో అనుకూలత, మానవత్వాల కలయికను పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ తరానికి అవసరమైన అసలైన శక్తి సామర్థ్యాలు ఇవేనని' పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ వ్యాపార నమూనాల కంటే సాంకేతికత అత్యంత వేగంగా మారుతుందన్నారు. ఎంత తెలుసనే దాని కంటే ఎంత త్వరగా నేర్చుకుంటారు, మార్పులకు ఎలా అలవాటుపడతారు, దానిని ఎలా అమలు చేస్తారు అనే దానిపైనే పోటీతత్వ ఆధిక్యత ఆధారపడి ఉంటుందన్నారు.
నైపుణ్యంలో లోతు, క్రమశిక్షణ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని పెంపొందించుకోవడం ద్వారానే విజయం సాధించవచ్చన్నారు. విద్యార్థులు జిజ్ఞాస పట్ల అంకితభావంతో ఉంటూ సమాజానికి అర్ధవంతమైన, శాశ్వతమైన విలువను అందించే దిశగా కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా యూసీ శాన్ డియాగో (యూఎస్ఏ) ఛాన్సలర్ ప్రదీప్ కే ఖోస్లా మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో మార్పులకు కేవలం ప్రతిస్పందించే సంస్థల కంటే, ఆ మార్పులను స్వయంగా తీర్చిదిద్దే సంస్థలే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు ఆలోచనలు, పరిశోధనలు, బాధ్యతాయుతమైన నాయకత్వానికి కేంద్రాలుగా మారి తమ ప్రాభవాన్ని క్యాంపస్ పరిమితులను దాటి విస్తరించాలన్నారు.
మహీంద్రా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఈ సంక్లిష్టమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు.. ఆత్మవిశ్వాసాన్ని, నిరంతరం నేర్చుకునే స్వభావాన్ని, ప్రజల జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలను కనుగొనే దృఢ సంకల్పాన్ని తమతో పాటు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేడురి మాట్లాడుతూ అకాడమిక్ నైపుణ్యం, విభిన్న రంగాల సమగ్ర బోధన, పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామిక భాగస్వామ్యాలు ఒకదానికొకటి తోడ్పడేలా ఒక అద్భుతమైన వాతావరణాన్ని నిర్మించామన్నారు.
అస్పష్టమైన పరిస్థితులను అధిగమించే సామర్థ్యం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, సమాజానికి అర్థవంతమైన సహకారాన్ని అందించే నైపుణ్యాలతో మా విద్యార్థులు బయటకు వెళ్తున్నారన్నారు.
విశ్వవిద్యాలయం తన విద్యా సేవలను, పరిశోధనా సామర్థ్యాలను మరింత విస్తరిస్తున్న తరుణంలో జాతీయ ప్రాధాన్యతలను పరిష్కరిస్తూ అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో పోటీపడగల నాయకులను తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టభద్రులతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వివిధ విభాగాలకు చెందిన 1309 మంది విద్యార్థులకు డిగ్రీల పట్టాలు అందజేశారు.
అందులో 22 మందికి పీహెచ్‌డీలు, అసాధారణ ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. ఈ వేడుకలలో పరిశ్రమలతో అనుసంధానించబడిన అభ్యసనాన్ని మరింత విస్తరించాలనే విశ్వవిద్యాలయ లక్ష్యంలో భాగంగా నూతన 'బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్' ను బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రారంభించారు




