Ananthagiri: అనంతగిరిలో ఈకో టూరిజం ప్రాజెక్టులు ప్రారంభం.. అభివృద్ధికి ఊతం
Ananthagiri: వికారాబాద్ అనంతగిరిలో ఈకో టూరిజం అభివృద్ధి పనులు ప్రారంభం. పర్యాటకులకు సౌకర్యాలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పీకర్ తెలిపారు.
Ananthagiri
Ananthagiri: వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలో ఈకో టూరిజం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సోమవారం అనంతగిరి గుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనంతగిరి ఈకో అర్బన్ పార్క్, కొండల వీక్షణ గోపురం, పర్యావరణ పట్టణ ఉద్యానవనం, అటవీ అతిథి గృహంలోని ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ – ది బ్రీజ్’ వంటి ప్రాజెక్టులను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి. సువర్ణ, చీఫ్ కన్సర్వేటర్లు ప్రియాంక వర్గీస్, సునీత భగవత్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్యలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, అనంతగిరి ప్రాంతాన్ని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా వికారాబాద్ జిల్లాకు దశలవారీగా అభివృద్ధి చేకూరుతుందని తెలిపారు. ఈకో టూరిజం వల్ల పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.
అనంతగిరి గుట్టలో ఔషధ గుణాలు కలిగిన అనేక మూలికలు, చెట్లు ఉండటం వల్ల పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
అనంతరం మూసీ నది జన్మస్థలాన్ని ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




