Ghatkesar: మత్తు పదార్థాలపై యుద్ధం.. శ్రీనిధి విద్యార్థుల ప్రతిజ్ఞ
Ghatkesar: ఘట్‌కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Ghatkesar: మత్తు పదార్థాలపై యుద్ధం.. శ్రీనిధి విద్యార్థుల ప్రతిజ్ఞ
ఘట్ కేసర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ యాంటీ డ్రగ్ డ్రైవ్ కార్యక్రమం కింద మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో మత్తు పదార్థాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. నవీన్‌కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. ముకుంద రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదకర వ్యసనమని హెచ్చరించారు.
విద్యార్థులు డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండి తమ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. ముకుంద రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం, రవాణా, విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
ఘట్ కేసర్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూపల్లి రవి సహా ఇతర అధికారులు, కాప్రా ఎక్సైజ్ బృందం విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఎక్సైజ్ శాఖ చొరవతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యం పెంపుకు దోహదపడిందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.




