Kapra: అర్షా స్కూల్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ పీస్’ సక్సెస్!
Kapra: కాప్రా సైనిక్‌పురి పరిసర ప్రాంతాల్లో అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ పీస్' (5K రన్) ఘనంగా జరిగింది.
Kapra: అర్షా స్కూల్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ పీస్’ సక్సెస్!
కాప్రా: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధాలు, హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున "రన్ ఫర్ పీస్" కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాప్రా సైనిక్‌పురి పరిసర ప్రాంతాల ఉత్తర-తూర్పు కాలనీల నివాసితులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 'యుద్ధం వద్దు- ద్వేషం వద్దు- ఉగ్రవాదం వద్దు' అనే ప్రధాన నినాదంతో సాగింది.
ఈ శాంతి పరుగు కార్యక్రమాన్ని జవహర్‌నగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఎస్. చక్రపాణి, హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త నరేష్ సుంకర, అర్షా స్కూల్ డైరెక్టర్ సాయి ఫణేంద్ర, ప్రిన్సిపల్ శ్రీమతి చిత్రా ఎం. భట్ జెండా ఊపి ప్రారంభించారు.
అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ఐదు కిలో మీటర్ల శాంతి పరుగు, పరిసర కాలనీల గుండా సాగి తిరిగి పాఠశాల ప్రాంగణంలో ముగిసింది. పాల్గొన్న వారంతా ఉత్సాహంగా పరిగెత్తుతూ 'భవిష్యత్తు సైరన్లతో కాదు... పిల్లల నవ్వులతో మార్మోగాలి' అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పింది.
పాఠశాల చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు అభినందించారు. యువతలో శాంతి భావన, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం వంటి విలువలను పెంపొందించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం అంద జేశారు. శాంతి యుత, ఆరోగ్యవంతమైన, సామరస్యపూరిత సమాజ నిర్మాణానికి అందరూ తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.




