Ghatkesar: ఘట్‌కేసర్ ఆటో డ్రైవర్ అత్యాచారం, నిందితుడి అరెస్ట్

Ghatkesar: ఆటోలో వెళ్తున్న మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు.

KARUNAKAR, UPPAL
Published on: 9 July 2026 9:33 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్ ఆటో డ్రైవర్ అత్యాచారం, నిందితుడి అరెస్ట్

ఘట్‌ కేసర్: ఘట్‌ కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్ మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై, ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 8న ఉదయం సుమారు 10:30 గంటలకు ఓ మహిళ ఉప్పల్‌ లోని భరత్‌నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కి ఘట్‌ కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది. అయితే ఆటో డ్రైవర్ మార్గమధ్యంలో భరత్‌నగర్‌లోని తాటికల్లు డిపో వద్ద ఆగి కల్లు పార్సెల్ తీసుకున్నాడు.

ఆ తర్వాత మహిళను ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, స్ప్రైట్ బాటిల్‌లో మత్తు పదార్థం కలిపి తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన అనంతరం అత్యాచారానికి పాల్పడి, ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు నగదును అపహరించి అక్కడే వదిలేసి పరారయ్యాడు.

కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఎస్‌హెచ్‌ఓ కనకయ్య గౌడ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు ఆంగోతు జేత్యను జూలై 9న సాయంత్రం 4 గంటల సమయంలో అన్నోజిగూడలో అదుపులోకి తీసుకొన్నారు.

నిందితుడి వద్ద నుంచి ఆటోతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శనివారం న్యాయస్థానం ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story