Basheerabad: దర్గా భూముల్లో అక్రమ సున్నపురాయి మైనింగ్ నిలిపివేయాలి!

Basheerabad: బషీరాబాద్ మండలం ఏక్మాయి దర్గా పరిసరాల్లో అక్రమ లైమ్‌స్టోన్ మైనింగ్‌ను నిలిపివేయాలని ఎమ్మార్వోకు వినతి. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలపై నేతల ఆగ్రహం.

Srikanth Reddy, Tandur
Published on: 29 Oct 2026 6:08 PM IST
Basheerabad
X

Basheerabad: దర్గా భూముల్లో అక్రమ సున్నపురాయి మైనింగ్ నిలిపివేయాలి!

బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలోని హజ్రత్ షాదులహ్ హుస్సేని దర్గ పరిసరాల్లో (సర్వే నంబర్ 147) సాగుతున్న అక్రమ సున్నపురాయి (Limestone) మైనింగ్‌ను వెంటనే నిలిపివేసి, దర్గా మరియు ప్రభుత్వ భూములను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

కే. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే.చంద్రయ్య, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు గుమ్మడి రత్నం లు బషీరాబాద్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన దర్గా పరిసరాల్లో అనధికారికంగా జరుగుతున్న అక్రమ సున్నపురాయి మైనింగ్ వ్యవహారంపై తగిన తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. దర్గాకు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 147 లో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో రూ.కోట్ల విలువ చేసే సున్నపురాయి నిల్వలు ఉన్న ప్రభుత్వ భూమి ఉందన్నారు.

ఈ భూమికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించి తక్షణ చర్యలు తీసుకో వాలన్నారు. 2011వ సంవత్సరంలో సర్వే నంబర్ 147 లోని కేవలం1.20 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే మైనింగ్ లీజు తీసుకోవడం జరిగిందన్నారు. ఆ లీజు గడువు 2017లోనే ముగిసిపోయి గత 7 సంవత్సరాలు గడుస్తున్నా, ఎలాంటి నూతన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 30 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి అక్రమంగా క్వారీ తవ్వకాలు జరుపుతున్నారన్నారు.

దీనివల్ల ప్రభుత్వ రాబడికి భారీగా గండి పడడమే కాకుండా దర్గా ఉనికికి ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉందన్నారు. తక్షణమే సర్వే నంబర్ 147 లో సాగుతున్న అక్రమ క్వారీ, మైనింగ్ తవ్వకాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur