Abdullapurmet: బాటసింగారంలో ఉద్రిక్తత గణేష్ విగ్రహం ఏర్పాటుపై రగడ!
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో వినాయక విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న సర్పంచ్‌పై ముదిరాజ్ సంఘం ఆగ్రహం. కోర్టు స్టే వివాదంపై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
Abdullapurmet: బాటసింగారంలో ఉద్రిక్తత గణేష్ విగ్రహం ఏర్పాటుపై రగడ!
Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని సర్వే నంబర్ 10లో ఉన్న ప్రభుత్వ భూమిలో ముదిరాజ్‌లకు చెందిన పెద్దమ్మ గుడి ప్రాంగణంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, గ్రామ సర్పంచ్ గౌరీశంకర్ చారి అడ్డుకుని గేటుకు తాళం వేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు.
అదే ప్రాంగణానికి వెనుక ఉన్న సర్వే నంబర్ 60 భూమికి సంబంధించిన కోర్టు స్టేను చూపిస్తూ బోర్డు ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసినట్లు ముదిరాజ్ కాలనీ సంఘం నాయకులు తెలిపారు. గణేష్ విగ్రహాన్ని ప్రాంగణంలోకి తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు సర్పంచ్ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వే నంబర్ 10 ప్రభుత్వ భూమి అయితే దానికి స్టే ఎలా వస్తుందని ముదిరాజ్ సంఘం నాయకులు ప్రశ్నించారు. గతంలో స్థానిక తహసీల్దార్ (ఎమ్మార్వో) కూడా సంఘటనా స్థలానికి వచ్చి అది ప్రభుత్వ భూమేనని తెలిపి గేటుకు వేసిన తాళాన్ని తొలగించినట్లు వారు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సమస్యను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




