Uppal: ఉప్పల్ మినీ శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం!
Uppal: ఉప్పల్ మినీ శిల్పారామంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళల బతుకమ్మ ఆటలు, లహరి ఘంటసాల బృందం కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Uppal: ఉప్పల్ మినీ శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం!
Uppal: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఉప్పల్ మినీ శిల్పారామంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిల్పారామం మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సందర్శకులతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీమతి లహరి ఘంటసాల శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. గణపతి తాళం, మూషికవాహం, నోటుస్వరం, బృందావన నిలయే, తిల్లాన, సతులారా, బొమ్మ బొమ్మ, మధురాష్టకం, అన్నమయ్య సంకీర్తనలు తదితర అంశాలను ప్రదర్శించారు.
కళాకారులు నిత్య, తులసి, హరినందన, ఉజ్వల, నైనిక, చిన్మయి, నివేదిత, భవ్య, ధృతి, రమ్య, మానస, మహాన్వి తదితరులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించి మెప్పించారు. శాస్త్రీయ నృత్యాల ద్వారా భారతీయ కళా సంప్రదాయాలను చాటిచెప్పారు. చక్కటి హావభావాలు, లయబద్ధమైన నృత్యాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని మినీ శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. బతుకమ్మ ఆటపాటలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయి.




