Hyderabad: ఓయూలో భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలు
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆది హిందు సోషల్ సర్వీస్ లీగ్ వ్యవస్థాపకులు స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుక.
Hyderabad: ఓయూలో భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ, ఆది హిందు సోషల్ సర్వీస్ లీగ్ వ్యవస్థాపకులు స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలను మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాదాసు రాహుల్ రావు మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళల విముక్తి, విద్యా విస్తరణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో “ఆది హిందూ భవన్”, “భాగ్యనగర్” భావన, “ఆది హిందూ” పత్రిక స్థాపన ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించారని తెలిపారు. 1906 సంవత్సరంలోనే దళిత బాలికల కోసం తెలుగు మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అదేవిధంగా నిమ్న జాతుల సమస్యల పరిష్కారం కోసం “న్యాయ పంచ కమిటీలు”, “జగన్ మిత్ర మండలి” వంటి సంస్థలను ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం కృషి చేశారని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తో భాగ్యరెడ్డి వర్మ కి ఉన్న సన్నిహిత సంబంధాలు, జాతీయ స్థాయిలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠ్యాంశాలలో భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను తప్పనిసరిగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల స్టూడెంట్ జేఏసీ ఓయూ చైర్మన్ దాసరి రవి, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బత్తుల రమేష్, బత్తుల దిలీప్, అంజి బాబు, ప్రవీణ్, బైరు రవి, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




