Ghatkesar: ఘట్‌కేసర్‌లో బీజేపీ ధర్నా.. ధాన్యం అక్రమాలపై విచారణకు డిమాండ్!

Ghatkesar: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని మేడ్చల్ బీజేపీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.

KARUNAKAR, UPPAL
Published on: 25 Jun 2026 7:51 AM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌లో బీజేపీ ధర్నా.. ధాన్యం అక్రమాలపై విచారణకు డిమాండ్!

ఘట్‌ కేసర్: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, అధికారులు–రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఘట్‌ కేసర్ రైతు సహకార బ్యాంకు వద్ద బుధవారం ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తమ శ్రమతో పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే నాణ్యత, తేమ శాతం పేరుతో భారీ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

ఘట్‌ కేసర్ ప్రాంతంలో కొనుగోలు చేసిన సుమారు 59 వేల క్వింటాళ్ల ధాన్యంలో 6 నుంచి 7 వేల క్వింటాళ్ల వరకు కోతలు విధించడం రైతులపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమన్నారు. "ఒక రైతు 100 బస్తాల ధాన్యం తీసుకొస్తే దాదాపు 10 బస్తాల వరకు కోత విధిస్తున్నారు. రైతు ఏడాది పొడవునా శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసే సమయంలో ఇలా కోతలు పెట్టడం దారుణం. ఇది రైతుల చెమటను దోచుకోవడమే" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోతల పేరిట వసూలైన ధాన్యం, దానికి సంబంధించిన సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల మేర అవినీతి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్ల పాత్రపై ప్రత్యేక విచారణ జరపాలని కోరారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం పూర్తిగా గాలికొదిలేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన, ఘట్‌ కేసర్ రైతు సహకార బ్యాంకు పరిధిలో ఇప్పటికీ రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.

ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రత్యేక విచారణ నిర్వహించాలని, రైతుల నుంచి అన్యాయంగా కోత విధించిన ధాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story