Uppal: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!
Uppal: ఢిల్లీలో రాహుల్ నిరసనకు వ్యతిరేకంగా ఉప్పల్‌లో బీజేపీ ఆందోళన. రాహుల్ గాంధీ శవయాత్ర, దిష్టిబొమ్మ దహనం.
Uppal: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!
Uppal: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఖండిస్తూ ఉప్పల్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించి, అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, చిలకనగర్ డివిజన్ సీనియర్ నాయకుడు గోనె శ్రీకాంత్, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పరీక్ష వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది నకిలీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. 2002 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో 152కు పైగా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని, అప్పట్లో బాధ్యత వహిస్తూ అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా పలు పేపర్ లీకేజీలు జరిగాయని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేశారా అని నిలదీశారు.
ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ పదో తరగతి, ఉర్దూ భాషా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని, నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు.
నీట్ పరీక్షలో అవకతవకలు బయటపడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరీక్ష నిర్వహించి, విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుందని, బాధ్యులపై చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. పరీక్ష పూర్తై 44 రోజులు గడిచిన తర్వాత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం విడ్డూరమని, విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రత, అభివృద్ధికి ప్రతీకగా నిలిచారని, ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి దేశ ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ బీజేపీ నాయకులు, బీజేవైఎం, మహిళా మోర్చా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




