Malkajgiri: అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారం, విద్యా సామగ్రి పంపిణీ!

Malkajgiri: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మల్కాజిగిరి బిహార్ బస్తీలో అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారం, విద్యా సామగ్రి అందజేసిన బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.

Bodike Manohar, Malkajgiri
Published on: 6 Oct 2026 3:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారం, విద్యా సామగ్రి పంపిణీ!

Malkajgiri: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మల్కాజిగిరి బిహార్ బస్తీలో ‘అంగన్ మిలాన్ సేవా అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బిహార్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన రాంచందర్ రావు చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బందితో ముచ్చటించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి పౌష్టికాహారాన్ని అందజేశారు. అలాగే పాఠశాల బ్యాగులు, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారుల సంక్షేమం, మహిళా సాధికారత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో చిన్నారుల సంరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పరిమిత వేతనాలతోనూ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల నిస్వార్థ సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను శాలువాలతో సత్కరించారు. వారి సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉంటుందని రాంచందర్ రావు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri