Boduppal: బోడుప్పల్‌లో నీటి కష్టాలు.. జలమండలి ఆఫీస్ ముట్టడి!

Boduppal: బోడుప్పల్, చెంగిచెర్లలో తాగునీటి సమస్యపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు జలమండలి ఆఫీసును ముట్టడించారు. ఖాళీ బిందెలతో భారీ ధర్నా నిర్వహించారు.

KARUNAKAR, UPPAL
Published on: 25 Jun 2026 4:04 PM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో నీటి కష్టాలు.. జలమండలి ఆఫీస్ ముట్టడి!

బోడుప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్లలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, సిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు, మహిళలతో కలిసి గురువారం భారీ ర్యాలీ నిర్వహించి చెంగిచెర్లలోని జలమండలి (HMWSSB) కార్యాలయాన్ని ముట్టడించి, మహా ధర్నా నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్న ఈ ఆందోళనలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ర్యాలీగా జలమండలి కార్యాలయానికి వెళ్తూ మధ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అనంతరం జలమండలి కార్యాలయాన్ని ముట్టడించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలు బిందెలతో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కాలనీ వాసులు, మహిళలు మాట్లాడుతూ బోడుప్పల్–చెంగిచెర్ల ప్రాంతాల్లో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని, అది కూడా తక్కువ ప్రెషర్‌తో రావడం వల్ల అనేక కాలనీలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నీటి సమస్యలపై అనేకసార్లు జలమండలి అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. "ఇది ప్రభుత్వ వైఫల్యమా.. అధికారుల నిర్లక్ష్యమా?" అని ప్రశ్నించారు.

ఇంటి పన్ను, నీటి పన్ను క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించడంలో మాత్రం విఫలమవుతున్నారని మండిపడ్డారు. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో రెండు డివిజన్ల ప్రజలు జలమండలి వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

అయితే ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు అధికంగా ఉండటంతో ఒకసారి బుక్ చేస్తే పది రోజుల తర్వాత మాత్రమే నీరు అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్యాంకర్ నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి వస్తోందన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు వాపోయారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతి ఇంటికి నీరు అందించడం మా న్యాయమైన డిమాండ్" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజలు తీవ్రమైన నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు..

ఇప్పటికైనా ప్రభుత్వం, జలమండలి అధికారులు స్పందించి బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్లలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే మహిళలందరినీ సమీకరించి మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని మహిళా నాయకులు, కాలనీ వాసులు హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story