Boduppal: రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ బైక్ ర్యాలీలో అజయ్ యాదవ్

Boduppal: హైదరాబాద్‌లో గిగ్ కార్మికుల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన బైక్ ర్యాలీలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 14 Nov 2026 11:55 PM IST
Boduppal
X

Boduppal: రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ బైక్ ర్యాలీలో అజయ్ యాదవ్

బోడుప్పల్‌: గిగ్‌ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో బోడుప్పల్‌ మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ ర్యాలీ శిల్పారామం నుంచి మాదాపూర్‌లోని జయభేరి గ్రౌండ్స్‌ వరకు సాగింది.

అనంతరం జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూపొందించిన చట్టాన్ని రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్మికుల నమోదుకు సంబంధించిన ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రారంభించడంతోపాటు సంక్షేమ నిబంధనల పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ చట్టం ద్వారా గిగ్‌ కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నారు.

ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, గుర్తింపు కార్డుల జారీ, వైఫై సదుపాయంతో కూడిన విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు వంటి ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. డెలివరీ సిబ్బంది, క్యాబ్‌ డ్రైవర్లు తదితర ప్లాట్‌ఫామ్‌ ఆధారిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంఘీభావంగా తోటకూర అజయ్‌ యాదవ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, గిగ్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL