Traffic Diversions: భాగ్యనగరంలో బోనాల పండుగ సందడి.. హైదరాబాద్‌లో నేడు, రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversions: హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా ఆది, సోమవారాల్లో పాతబస్తీ, అంబర్‌పేట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Hyderabad Traffic
Traffic Diversions: హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు, దర్బార్ మైసమ్మ, కార్వాన్, అంబర్‌పేట్ శ్రీ మహంకాళి ఆలయాల వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భాగ్యనగర ట్రాఫిక్ పోలీసులు ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీ పరిసర ప్రాంతాలు, అంబర్‌పేట్ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు పోలీసుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
పాతబస్తీలో ఆంక్షల సమయాలు, వాహనాల మళ్లింపు
* లాల్ దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు, అలాగే సోమవారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
* ఇంజిన్ బౌలి, ఫలక్‌నుమా మార్గం: ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి వైపు నుంచి ఆలియాబాద్‌కి వచ్చే వాహనాలను కొత్త షంషేర్‌గంజ్ టీ జంక్షన్ వద్ద మళ్లించి గోశాల, తాడ్‌బన్ లేదా మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు పంపుతారు.
* మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్ మార్గం: మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, ఖిల్వత్ దారిలో మళ్లిస్తారు.
* నాగుల్‌చింత, గౌలీపురా మార్గం: నాగుల్‌చింత నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్, గౌలీపురా మీదుగా అనుమతిస్తారు. గౌలీపురా నుంచి వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి, మీర్‌చౌక్ వైపు మళ్లిస్తారు.
* చార్మినార్, రాజన్న బౌలి మార్గం: చార్మినార్ నుంచి నాగుల్‌చింత వైపు వెళ్లే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ మార్గంలో అనుమతిస్తారు. రాజన్న బౌలి నుంచి వచ్చే వాహనాలను వెంకటేశ్వరస్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజ్ వైపు మళ్లిస్తారు.
* ఛత్రినాక, బాలాగంజ్ మార్గం: కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనాలను ఓపీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ వద్ద గౌలీపురా వైపు పంపుతారు. బాలాగంజ్ వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టాచ్యూ వైపు మళ్లిస్తారు. ఉప్పుగూడ వాహనాలను గౌలీపురా ఎక్స్‌రోడ్స్ వద్ద మొఘల్‌పురా వైపు పంపుతారు.
ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక నిబంధనలు
పాతబస్తీకి వచ్చే TGSRTC, APSRTC బస్సులు, భారీ వాహనాలకు పాతబస్తీ అంతర్భాగంలోకి ప్రవేశం లేదు. చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు బస్సులను అనుమతించరు. ఆర్టీసీ బస్సులను పాత సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్‌షిఫా ఎక్స్‌రోడ్స్, ఛత్రినాక, ఇంజిన్ బౌలి జంక్షన్ల వద్దే నిలిపివేసి, అక్కడ నుంచే ప్రత్యామ్నాయ మార్గాల్లో తిప్పి పంపుతారు. భారీ వాహనాలను సంతోష్‌నగర్, చంద్రాయణగుట్ట బైపాస్ మార్గాల వైపు మళ్లిస్తున్నారు.
అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద ట్రాఫిక్ రూట్ మ్యాప్
అంబర్‌పేట్ మహంకాళి ఆలయ బోనాల దృష్ట్యా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి.
* బస్సులు, ఆటోలు/కార్లు: ఉప్పల్ నుంచి చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ వైపు వెళ్లే, వచ్చే ఆర్టీసీ, సిటీ బస్సులు, భారీ వాహనాలు అన్నింటినీ అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు.
* భక్తుల పార్కింగ్: రామంతాపూర్ నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద ఎడమ బైలేన్‌లోకి వెళ్లి గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ మైదానంలో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
* స్థానిక మళ్లింపులు: రామంతాపూర్ నుంచి ఆలీ కేఫ్, రోడ్ నంబర్ 6 వైపు వెళ్లే వాహనాలను గాంధీ విగ్రహం ఎడమ బైలేన్ నుంచి సల్దానా గేట్ మీదుగా పంపుతారు. తిలక్‌నగర్, ఎన్‌సీసీ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలను రోడ్ నంబర్ 6 జంక్షన్ వద్ద గోల్నాక వైపు మళ్లించి అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు.




