Ghatkesar: SIR ప్రక్రియపై బీఆర్ఎస్ కీలక భేటీ.. బూత్ స్థాయి ఏజెంట్లకు కీలక ఆదేశాలు!
Ghatkesar: ఘట్‌కేసర్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, బూత్ స్థాయి ఏజెంట్లకు దిశానిర్దేశం.
Ghatkesar: SIR ప్రక్రియపై బీఆర్ఎస్ కీలక భేటీ.. బూత్ స్థాయి ఏజెంట్లకు కీలక ఆదేశాలు!
ఘట్ కేసర్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలో SIR (Special Intensive Revision) ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా విజయవంతం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ లో విస్తృత స్థాయి కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించింది. మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచనల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.
ఘట్ కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, ఉమ్మడి ఘట్ కేసర్ ప్రాంతానికి చెందిన పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిదని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు.
ఓటరు జాబితాలో అర్హుల పేర్లు తొలగిపోకుండా చూడటం, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్ల పేర్లను నమోదు చేయడం, అలాగే డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుల సవరణ వంటి అంశాలను అత్యంత శ్రద్ధతో పరిశీలించాలని నాయకులు ఆదేశించారు. అవసరమైన చోట వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు వివరాలను ధృవీకరించడం ద్వారా SIR ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.
“ప్రతి అర్హుడికి ఓటు హక్కు – ప్రతి బూత్‌లో బీఆర్ఎస్ బలోపేతం” అనే లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అలాగే బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర పార్టీ బలోపేతంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో BLAలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
ప్రతి బూత్‌ను పార్టీకి బలమైన కేంద్రంగా తీర్చిదిద్దాలని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, ఆకుల మధుకర్, కొత్త రవి గౌడ్, మీసాల కృష్ణ, కొత్త చక్రపాణి గౌడ్, బంధారం శ్రీధర్ రెడ్డి, పోచారం మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, నల్లవెల్లి శేఖర్, సురేందర్ రెడ్డి, మాధవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్యామల శ్రీనివాస్, అశోక్, జిలాని పాషా, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




