Uppal: కార్మికుల కన్నీళ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆర్టీసీ డిపో వద్ద నిరసన
Uppal: ఉప్పల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసనకు బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి మద్దతు తెలిపారు.
Uppal: కార్మికుల కన్నీళ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆర్టీసీ డిపో వద్ద నిరసన
ఉప్పల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల జేఏసీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీసీ జేఏసీ నాయకులు గజ్జెల సత్యరాజ్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన అమరుడైన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు పెంచుతామని, ఇంక్రిమెంట్లు ఇస్తామని, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఇలా అనేక ఉద్యోగులకు, వర్గాలకు, హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, కానీ ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.
గత మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా స్పందన లేదని అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ రెండున్నర సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఒక ఉద్యోగి మరణించగా, ఇంకో ఇద్దరు చావుబ్రతుకుల మధ్య ఉన్నారు. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసే వరకు కార్మికులకు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని రాగిడి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.




