Medchal: అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి.. బీఆర్ఎస్ నేతలు!
Medchal: అల్వాల్‌లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 1000 పడకల టిమ్స్ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని క్రిశాంక్, గజ్జెల నాగేష్ తదితర బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Medchal: అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి.. బీఆర్ఎస్ నేతలు!
Medchal: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఇన్చార్జి క్రిశాంక్, ఉద్యమకారుడు గజ్జెల నాగేష్, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.
నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, ప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 1000 పడకల టిమ్స్ ఆసుపత్రిని ఇప్పటికీ ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించి 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పగా, తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ 95 శాతం పనులు పూర్తయ్యాయని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 23 నెలల వ్యవధిలో ఐదు శాతం పనులు పూర్తి చేశారా అని నిలదీశారు.
గత సంవత్సరం ఆగస్టు 31 నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఆసుపత్రి అందుబాటులోకి రాలేదన్నారు. దసరా, దీపావళి నాటికి ప్రారంభిస్తామని చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారని విమర్శించారు. వరంగల్ ఆసుపత్రి ప్రారంభం పేరుతో వాయిదా వేస్తున్నట్టు అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ని కూడా వాయిదా వేశారని ఆరోపించారు.
కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆసుపత్రి ప్రారంభాన్ని జాప్యం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించకుండా ప్రైవేటు వైద్య సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. మెడికవర్ ఆసుపత్రి డైరెక్టర్లు, వాటాదారులతో ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్, కాంట్రాక్టర్ల వ్యవహారంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. పేద ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఉద్యమకారుడు గజ్జెల నాగేష్ మాట్లాడుతూ.. 2022 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అల్వాల్‌లో టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, దాంతోపాటు హైదరాబాద్ నగరం చుట్టూ మరో మూడు హాస్పిటల్ కు సుమారు రూ.3 వేల కోట్లతో నిర్మాణానికి నిధులు కేటాయించారని తెలిపారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకు రంగులు మార్చి ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజలకు ఎంతో ఉపయోగపడే టిమ్స్ ఆసుపత్రిని మాత్రం ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
దసరా, దీపావళికి ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం సంక్రాంతి సమీపిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఆసుపత్రిని నిర్వహించే సామర్థ్యం లేకపోతే కేసీఆర్ సలహాలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు. భూములపై చూపుతున్న శ్రద్ధ పేద ప్రజల వైద్య అవసరాలపై చూపడం లేదని విమర్శించారు.
ఆసుపత్రి ప్రారంభానికి ప్రభుత్వం కచ్చితమైన తేదీ ప్రకటించాలని, అల్వాల్ టిమ్స్‌ను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.




