LB Nagar: ఎల్‌బీనగర్‌లో బీఆర్ఎస్ ధర్నా ఓటర్ల జాబితాలో అక్రమాలపై సుధీర్ రెడ్డి ఆగ్రహం!

LB Nagar: ఓటర్ల జాబితాలో అక్రమాలు, అర్హులైన ఓటర్ల తొలగింపుకు నిరసనగా ఎల్‌బీనగర్ కూడలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 10 Oct 2026 1:55 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్‌బీనగర్‌లో బీఆర్ఎస్ ధర్నా ఓటర్ల జాబితాలో అక్రమాలపై సుధీర్ రెడ్డి ఆగ్రహం!

LB Nagar: ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే, నేడు బీజేపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను సృష్టిస్తూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ, ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లను అనైతికంగా తొలగిస్తోందనే ఆరోపణలు ప్రజాస్వామ్యంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఓటు చోరీ, ఓటర్ల జాబితాలో అక్రమాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు మద్దతుగా ఎల్‌బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్ కూడలి లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

SIR పేరుతో అర్హులైన ఓటర్ల తొలగింపుపై నిరసన

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అర్హులైన ఓటర్ల పేర్లు పెద్దఎత్తున తొలగిస్తున్నారనే ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తూ, ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తూ, శాంతియుతంగా నిరసన తెలిపే యువతను నిర్బంధిస్తున్న చర్యలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రంగా ఖండిస్తోంది.

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటింగ్ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, AI సాంకేతికతను ఉపయోగించి ప్రతిపక్షాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని, SIR ప్రక్రియ ద్వారా మోదీ ప్రభుత్వం అక్రమంగా ఓటర్ల పేర్లను తొలగిస్తోందనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నిరసన హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం

దేశ రాజధానిలో నిర్బంధ వాతావరణం నెలకొన్నట్లుగా సాగుతున్న చర్యలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్న తర్వాత కూడా 40 స్టేషన్లలో రాకపోకలకు అంతరాయం కలగడం, నార్తర్న్ రైల్వే పరిధిలో 38 రైళ్లను రద్దు చేయడం వంటి పరిణామాలతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను, ప్రయాణికులను ఇటార్సీ–భోపాల్ స్టేషన్ల వద్ద అడ్డుకోవడం, తెలంగాణ నుంచి తమ హక్కుల కోసం తరలివెళ్లిన విద్యార్థులను భోపాల్‌లో నిర్బంధించడం వంటి చర్యలు శాంతియుత నిరసన తెలిపే హక్కుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు.అరెస్టు చేసిన విద్యార్థులను వారి వారి రాష్ట్రాలకు క్షేమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

బిజెపి ఫేక్ మీడియా ద్వారా దేశద్రోహులని,పాకిస్తాన్ గూడచారులని,చైనా గూడచారులని,జార్జ్ సోరస్ మనిషి అనే ముద్రలు వేసే ప్రయత్నం మీ ఫేక్ మీడియా ద్వారా చేయకండి.మీరు గత 12 సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ.ఒక శాంతియుత ప్రజాస్వామ్య నిరసనను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమిటి? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పాలకులు, ప్రజల గొంతులను అణచివేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా?

ఎమర్జెన్సీ చరిత్రను గుర్తుచేస్తున్న ప్రస్తుత పరిణామాలు

1975లో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. నేడు ప్రజల హక్కులను అడ్డుకునే చర్యలు కొనసాగితే, అవి మరోసారి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే నిరంకుశ పోకడలనైనా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది.

ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి

ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈ ధర్నా ద్వారా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

పాలకులు గుర్తుంచుకోవాలి – నిర్బంధాలతో ప్రజాగ్రహాన్ని ఆపలేరు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుత నిరసన, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాదులు. ప్రజల హక్కులను కాపాడటం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కోసం బీఆర్ఎస్ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొని ఓటు హక్కు పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR